ఢిల్లీ ముఖ్యమంత్రే పంజాబ్ సీఎం!
posted on Apr 13, 2022 6:36PM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత. ఇది అందరికీ తెలుసు. కానీ, ఆప్ అధికారంలో ఉన్న రెండో రాష్ట్రం పంజాబ్ ముఖ్యమంత్రిఎవరు? పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఆయనే. అవును, ఢిల్లీ ముఖ్యమంత్రే పంజాబ్ ముఖ్యమంత్రి. కానీ, అట్టెట్టవుద్ది, అది కుదరదు కదా, అనుకొవచ్చును.నిజమే, ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కాదు, రెండు సభలో సభ్యుడు కావడం కూడా కుదరదు. అందుకు రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకే, అప్పటికే ఎంపీగా ఉన్న పంజాబ్ ‘బొమ్మ’ ముఖ్యమంత్రి భగవంత్ మాన్’ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామ చేసి, పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, ఢిల్లీతో పాటుగా డీఫ్యాక్టో సీఎంగా పంజాబ్’ను పాలిస్తున్నారు.
అవును ఇదేదో ఆరోపణ కాదు. కొద్దిరోజుల క్రితం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించుకున్నారు. పంజాబ్’లో విధ్యుత్ పరిస్థితిని సమీక్షించారు. ఆ సమావేశంలో పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంజాబ్ విద్యుత్ శాఖ కార్యదర్శి సహా అనేక మంది ఇతర అధికారులు పాల్గొన్నారు. కానీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్’ మాత్రం సమావేశంలో పాల్గొనలేదు. అసలు అలాంటి సమావేశం ఒకటి జరిగిందని ఆయనకు తెలుసోలేదో కూడా మనకు తెలియదు.
ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నేరుగా, సమావేశం కావడం, ఆ రాష్ట్ర విద్యుత్ పరిస్థితిని సమీక్షించడం పై ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ముఖ్యమంత్రి మాన్, ఢిల్లీ సీఎం చేతిలో రబ్బర్ స్టాంప్ అయ్యారని ఆరోపించారు. ‘భయపడినంతా జరిగింద’ని అన్నారు. కేజ్రీవాల్ డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తారని ఉహిచిందే, కానీ, ఇంత త్వరగా ముఖ్యమత్రి మాన్ బొమ్మగా మారిపోతారని అనుకోలేదు, అన్నారు. మరో వంక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి పంజాబ్ డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.అలాగే, “ముఖ్యమంత్రి భగవాన్ మాన్ లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అధికారులను సమన్ చేయడం (పిలిపించడం)తో ఆయనే రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్’ను పరిపాలిస్తున్న డీఫ్యాక్టో సీఎం అనే విషయం తేలిపోయింది” అని పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్దూ తమదైన స్టైల్లో చురకలు వేశారు. “ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం. పంజాబ్ ఆత్మ గౌరవానికి జరిగిన అవమానం. ఈ విషయంలో కేజ్రీవాల్, మాన్ స్పందించాల”ని సిద్దూ ట్వీట్ చేశారు.
మరోవంక శిరోమణి అకాలీదళ్, ఎస్ఏడీ పంజాబ్ ప్రజలు ఢిల్లీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ పాలన కోరుకోవడం లేదని, అంటూ అలాంటి అవకాశం కేజ్రీవాల్’కు ఇవ్వవద్దని సూచించింది. పంజాబ్ పై పొరుగు రాష్ట్రం అధిపత్యం వలన నదీజాలాల పంపకం వంటి కీలక అంశాల్లో పంజాబ్’కు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఎస్ఏడీ నేత దల్జిత్ సింగ్ చీమా హెచ్చరించారు.
అలాగే, బీజేపీ సీనియర్ నాయకుడు తరుణ్ చుగ్ ‘ మొదటి నుంచి కూడా పంజాబ్ పరిపాలనా వ్యవహారాల్లో కేజ్రీవాల్ జోక్యం చేసుకుంటున్నారు, ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి లేకుండా ఆ రాష్ట్ర అధికారులతో ఆ రాష్ట్ర సమస్యలు చర్చించారు. అంటే పంజాబ్ ప్రజలను అవమానించడమే అన్నారు. అయితే ఆప్ జాతీయ కన్వీనర్ హోదాలో కేజ్రీవాల్ పంజాబ్ అధికారులతో అనధికార సమావేశం నిర్వహించారని అందులో తప్పులేదని, ఆపార్టీ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్’.. కేజ్రీవాల్’ ను సమర్ధించారు. అయితే, ఇదేమీ అనూహ్య పరిణామం కాదని, కానీ, పంజాబ్ వంటి స్వాభిమాన రాష్ట్రం ఈ ధోరణి అట్టేకాలం సహించదని పరిశీలకులు అంటున్నారు.