ఏలూరు పేలుడుపై విచార‌ణ‌కు ఆదేశం.. క్ష‌త‌గాత్రుల ప‌రిస్థితి విష‌మం..

అర్థ‌రాత్రి భారీ పేలుడు. ఫార్మా కంపెనీలో రియాక్ట‌ర్ పేలి భారీ విస్పోట‌నం. అదేదో పెద్ద బాంబు పేలిన‌ట్టు పేలిపోయింది. భారీగా మంట‌లు చెల‌రేగాయి. ఆ పేలుడుతో అక్కడ ప‌ని చేస్తున్న కార్మికులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. ఐదుగురు అక్క‌డిక్క‌డే మాడిమ‌సైపోయారు. మ‌రొక‌రు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయారు. 12మందికి తీవ్ర గాయాల‌య్యాయి. వారంద‌రి శ‌రీరాలు 80శాతానికి పైగా కాలాయి. వారి ప‌రిస్థితి తీవ్ర విష‌మంగా ఉంద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. విషాదంపై సీఎం జ‌గ‌న్‌, గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్‌, ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్‌-4లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటల ధాటికి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు బిహార్‌ వాసులున్నట్లు గుర్తించారు. బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌ తీసుకెళ్లారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌  సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాసేప‌టి తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.  ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 150 మంది ఉన్నట్లు చెబుతున్నారు. 

అగ్నిప్రమాద బాధితులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. 12 మందికి 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని చెప్పారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు విజయవాడ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. బాధితులను చూసి బోరున విలపిస్తున్నారు. బాధితుల నుంచి మేజిస్ట్రేట్‌ వివరాల సేకరించారు.

బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోరారు.  మృతుల కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి 25 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి 2 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేస్తామ‌న్నారు. ప్ర‌మాదంపై పూర్తి స్థాయి ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌ను ఆదేశించారు సీఎం జ‌గ‌న్‌.  


Online Jyotish
Tone Academy
KidsOne Telugu