కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు వాయిదా.. కవిత ధర్నా వృధా !?
posted on Jun 5, 2025 5:53PM
.webp)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద బుధవారం (జూన్ 4) చేపట్టిన ధర్నా వృధా అయ్యింది. అత్యంత వ్యూహాత్మకంగా కవిత చేపట్టిన ఈ ధర్నాకు ఎలాంటి మైలేజీ రాకుండా, ఆమె తండ్రి, అన్న కుట్రపన్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ గురువారం (జూన్ 5) కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతారని కవిత అంతకు ఒక రోజు ముందే ధర్నాకు పిలుపునిచ్చారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్న తరువాత చివరి నిముషంలో కేసీఆర్ విచారణకు మరో రోజు హాజరౌతానంటూ కమిషన్ కు లేఖ రాయడం, అందుకు కమిషన్ అంగీకరించి 11వ తేదీన విచారణకు రావాల్సిందిగా చెప్పడం జరిగిపోయాయి. దీంతో కవిత ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ధర్నా ప్రాధాన్యత కోల్పోయింది. ధర్నాలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం వెనుక.. ఆయనను రాజకీయంగా బద్నాం చేయాలన్న ఉద్దేశం ఉందని ఆరోపించారు. కొన్ని పంచ్ డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించారు. కానీ కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కావడం వాయిదా పడటంతో కవిత ధర్నా వృధాగా మారిపోయింది. కవిత ధర్నాకు ఎటువంటి మైలేజీ, పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండొద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ విచారణకు మరో రోజు వస్తానంటూ కాళేశ్వరం కమిషన్ కు లేఖ రాసి వాయిదా తీసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
దీంతో కేసీఆర్ ఫొటో పెట్టుకుని కూడా బీఆర్ఎస్ ను పూర్తిగా విస్మరించి కవిత బిగ్ పొటికల్ స్టెప్ వేయడానికి నాందిగా ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నా అనుకున్నప్రయోజనాన్ని సాధించలేకపోయారు.
ఇక కవిత ధర్నాలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. సరే జాగృతి బ్యానర్ పై ఆమె ధర్నా చేశారు కనుక బీఆర్ఎస్ జెండాలు లేవని అనుకుందాం.. కానీ ఈ ధర్నాలో ఎక్కడా మచ్చుకి కూడా బీఆర్ఎస్ నాయకులు కనిపించలేదు. కేసీఆర్ ఫొటోతో, కేసీఆర్ కు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లేకపోవడాన్ని బట్టి చూస్తుంటే.. కవితను బీఆర్ఎస్ పూర్తిగా బాయ్ కాట్ చేసిందని భావించక తప్పదు.
వాస్తవానికి కవిత బీఆర్ఎస్ ను ధిక్కరించినా.. ఆమె ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపడడానికి పోరాడుతున్న యోధురాలిగానే కవితను బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. ఎందుకంటే ఆమె తన ప్రసంగాలలో కాంగ్రెస్, బీజేపీలపై సమానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ తన దేవుడని చెబుతున్నారు. అటువంటప్పుడు ఇటువంటి కార్యక్రమాలను బీఆర్ఎస్ డిస్ ఓన్ చేసుకోవడం ఎందుకన్న బాధ బీఆర్ఎస్ క్యాడర్ లో కనిపిస్తోంది.