కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన   సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో కేసీఆర్ బాధపడుతున్నారు. రోజుల తరబడి టెంపరేచర్ కంట్రోల్ లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు.

యశోదా ఆస్పత్రిలో   వైద్యులు  కేసీఆర్ కు పరీక్షలు నిర్వహించారు.  ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, జ్వరం తగ్గి,  వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను చూసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా అస్వస్థతతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో  అడ్మిట్ అయిన విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆస్పత్రి వైద్యులు, అధికారులతో ఫోన్ లో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.