గట్టు వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి.. సుప్రీం ఆదేశం
posted on Aug 12, 2025 3:40PM

తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం (ఆగస్టు 12) ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తనకే అందజేయాలని కూడా సుప్రీం కోర్టు విస్పష్టంగా ఆదేశించింది ఈ హత్య కేసులో దోషులు ఎవరినీ వదిలిపెట్టరాదని, రాజకీయ ఒత్తిళ్లు, పలుకుబడులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీం కోర్టు సీబీఐకి విస్పష్ట ఆదేశాలిచ్చింది.
ఇక గట్టువామనరావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరిలో జరిగింది. దంపతులిద్దరూ హైకోర్టు న్యాయవాదులు. పెద్దపల్లికి చెందిన వీరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భూములకు సంబంధించిన వివాదంపై ఓ కేసులో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు తమపై పగబట్టారని వామనరావు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు. పుట్ట మధు సోదరులు తమపై కత్తి కట్టారని, వారే తమ హత్యకు కారకులనీ వామనరావు ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాకు వెళ్లి వస్తున్న సమయంలో కల్వచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు అడ్డుకుని, నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో హైకోర్టు న్యాయవాదులు వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం విచారణను పూర్తి చేసింది. అయితే, అసలు నిందితులను తప్పించారని ఆరోపిస్తూ వామనరావు తండ్రి కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటి షన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం కోరింది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ సర్కార్ సుప్రీంకు తెలిపింది. అలాగే వామనరావు మరణవాంగ్మూలం సరైనదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక స్పష్టం చేయడంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.