కన్నకొడుకుతో పాటే అతడికి ఇష్టమైన బైక్ సమాధి
posted on Aug 13, 2025 7:04AM

ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు.. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లిదండ్రులకూ సాధ్యం కాదు. వారి బాధకు అంతే ఉండదు.ఆ కడుపుకోత భరించడం ఎంతటి వారికైనా కష్టమే. తాజాగా కన్నకొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తండ్రి.. తన కుమారుడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేయడం కంటనీరు తెప్పించింది. వివరాల్లోకి వెడితే.. గుజరాత్ జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల క్రిష్ పర్మార్ మరణించాడు. ఇటీవలే 12 స్టాండర్డ్ పాస్ అయిన ఆ యువకుడు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) ప్రోగ్రామ్‌లో చేరాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తను జాయిన్ కావాలనుకున్న కాలేజీకి వెళ్లాడు. వెళ్లి తన సర్టిఫికేట్స్ చూపించాడు. చేరాలనుకున్న కోర్సు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అన్ని ఓకే అనుకున్నాక ఆడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యాడు. హ్యాపీగా తన బైక్ మీద ఇంటికి బయల్దేరాడు. కాలేజీ నుంచి కొద్ది దూరంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. 12 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశాడు.
కన్నకొడుకు మరణించడంతో అతని తల్లిదండ్రుల దుఖానికి అంతే లేకుండా పోయింది. చివరకు తమ కొడుకు మృతదేహాకి అంత్యక్రియలు చేసే సమయంలో అతడికి ఎంతో ఇష్టమైన అతడి బైక్ ను కూడా అతడితోనే సమాధి చేశారు. క్రిష్ కు మోటార్ సైకిల్ అంటే ఎంతో ఇష్టం. కారు ఉన్నప్పటికీ, అతడు బైక్ మీదే ప్రయాణించే వాడు. ఈ నేపథ్యంలో అతడికి ఎంతో ఇష్టమైన బైక్ ను కూడా అతడితో పాటే సమాధి చేశారు. ఈ దృశ్యం వారందరినీ ఎంతో కదలించివేసింది.