పులివెందులలో ఎన్నిక జరిగితే.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటారేంటి?

గత ఏడాది ఎన్నికలలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక జరిగినా రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేక ఓడిపోతున్నాం అంటున్నారు వైసీపీ నేతలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పించి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసిన వైసీపీ.. ఇప్పుడు ఆ పార్టీ అడ్డాగా చెప్పుకునే పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరిగినా చేతులెత్తేసింది.  ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలోనే జరిగిందిగా అన్న ప్రశ్నకు   సమాధానం చెప్పలేక గుటకలు మింగుతోంది.

వాస్తవానికి పులివెందులలో ఎన్నిక.. అదీ బ్యాటెల్ పద్ధతిలో అంటే.. వైపీపీ నేతలు విజయంపై ధీమాగా ఉండాలి. అయితే అలా లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగితే ఎలా గెలుస్తాం అనుకున్నారో ఏమో పోలింగ్ రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తమ అనుచరులతో రెచ్చిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడాన్ని అడ్డుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించారు.

 పోలీసులు ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని గృహనిర్బంధం చేసినా తప్పించుకుని మరీ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసి, పోలింగ్ బూత్ లలోకి చొచ్చుకుపోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగి నానా హడావుడీ చేశారు.  జగన్ అడ్డా ఇక్కడ తిరుగేలేదు అంటూ ఇంత కాలం విర్రవీగిన వైసీపీయులు అదే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి భయంతో వణికిపోయారు. మా అడ్డాలో మమ్మల్ని రిగ్గింగ్ చేసుకోనివ్వరా, పోలింగ్ బూత్ లను కబ్జా చేయనియ్యరా? ఇదెక్కడి చోద్యం అన్నట్లుగా వారు గలాటా చేసైనా సరే బూత్ లను కబ్జా చేయాలని ప్రయత్నించారు.  ఓటమి భయంతో వణికిపోయారు. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కోల్పోతే అది తెలుగుదేశం విజయం అనికానీ, వైసీపీ ఓటమి అని కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ భావించరు. దానికి వైఎస్ జగన్ ఓటమి అనే అంటారు. అంతే కాదు.. ఈ ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై పడుతుంది. దింపుడు కళ్లెం ఆశతో ఇంకా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన క్యాడర్ చెల్లాచెదురైపోతుంది. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో జగన్ పలచన అయిపోతారు. అందుకే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో వైపీపీ గాభరాపడుతోంది.  

సొంత అడ్డాలో ఇంత చిన్న ఎన్నికలను ఎదుర్కోలేకపోతే రేపు సార్వత్రిక ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటామని క్యాడర్ నీరుగారిపోతుందనీ, పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని బెంబేలెత్తి పోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. కానీ జనం మాత్రం 11 మంది బరిలో నిలిచి ఎన్నిక  జరిగితే.. ఆ ఎన్నికలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైతే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లినట్లౌతుంది కానీ ఖూనీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu