అప్రజాస్వామికం.. రాహుల్ పై అనర్హత వేటుపై కేసీఆర్ స్పందన

రాహుల్ గాంధీపై అనర్హత వేటును విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభ సెక్రటేరియెట్ పై ఒత్తిడి తెచ్చి రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని చెప్పించిందని విమర్శిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి తప్పుడు అన్వయమేనని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు విషయంలో మోడీ సర్కార్ చూపిన వేగం చూస్తుంటే రాహుల్ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేశారన్న సంగతి తేటతెల్లమౌతోందని కేసీఆర్ పేర్కొన్నారు.

మోడీ సర్కార్ ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ను విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. కేంద్రం ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐలను ఎలా అయితే దుర్వినియోగం చేసిందో అలా క్రిమినల్ డిఫమేషన్ ను విపక్ష నేతలపై అనర్హత వేటు వేయడానికి ఉపయోగించుకుంటోందని, ఇది చాలా దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ  దురహంకారానికి, నియంతృత్వానికీ ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను వేధించే హేయమైన చర్యలకు వినియోగించుకోవడం దారుణమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులంతా కలిసి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను సమష్టిగా ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.