సుప్రీంకోర్టుకు కేసీఆర్ స‌ర్కార్‌.. అక్క‌డైనా ఊర‌ట ద‌క్కేనా?

తెలంగాణ స‌ర్కారు నిర్లక్ష్యం ఇప్పుడు మెడ‌కు చుట్టుకుంది. ఓవైపు స‌మ‌యం మించిపోతోంది. మ‌రోవైపు చేతులెత్తేయ‌డం మిన‌హా మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేదు. ఏళ్లుగా కోర్టులు చెబుతున్నా.. క‌నీసం సోయి కూడా లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కాల‌క్షేపం చేస్తూ వ‌స్తోంది. ఈసారి మాత్రం గ‌తంలో మాదిరి కుద‌ర‌దు.. డైవ‌ర్ట్ చేయాల్సిందేన‌ని హైకోర్టు గ‌ట్టిగా చెప్ప‌డంతో.. టీఆర్ఎస్ స‌ర్కారు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. అదంత ఈజీ వ్య‌వ‌హారం కాక‌పోవ‌డంతో.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాల‌ని భావిస్తోంది. 

హుస్సేన్‌సాగ‌ర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారుచేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని.. నిమజ్జనానికి అనుమతి కోరాలని కేసీఆర్ సూచించారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గత వారం ఇచ్చిన ఉత్తర్వులను సడలించడానికి సోమవారం హైకోర్టు నిరాకరించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌ సహా జలాశయాల్లో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న కుంటల్లోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. జల కాలుష్యానికి మీరే అనుమతిస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ తీరును తప్పుపట్టింది. పీవోపీ విగ్రహాలను, సింథటిక్‌ రంగులను వినియోగించరాదని, కాలుష్యాన్ని నివారించాలని పదేపదే చెబుతున్నా మీరు నిద్రలేవకుండా కాలుష్యానికి అనుమతించారంటూ తప్పుపట్టింది. తాము కేవలం చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే చెబుతున్నాం అని కోర్టు వ్యాఖ్యానించింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని స్ప‌ష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించలేమని తేల్చి చెబుతూ జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది.

హుస్సేన్‌సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం వ‌ద్దంటూ గ‌తంలోనూ ప‌లుమార్లు హైకోర్టు తీర్పులు చెప్పింది. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు ఈ ఒక్క‌సారికి అంటూ ప్ర‌భుత్వం అనుమ‌తులు సంపాదిస్తోంది. ఈసారి మాత్రం హైకోర్టు సీరియ‌స్‌గా ఉంది. ఉత్త‌ర్వులు స‌వ‌రించడానికి స‌సేమిరా అంటోంది. దీంతో.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌లేక జీహెచ్ఎమ్‌సీ అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మ‌రోవైపు మంత్రి కేటీఆర్ బ‌ల్దియా అధికారుల‌తో భేటీ అయి.. అన్ని వినాయ‌క విగ్ర‌హాల‌కు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాల‌ని.. న‌గ‌రంతో పాటు చుట్టుప‌క్క‌ల ఉన్న 23 నీటి కుంట‌ల‌ను గుర్తించి.. అందులో వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం చేసేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తే.. ఇలా 23 చిన్న నీటికుంట‌ల్లో నిమ‌జ్జ‌నం జ‌రిగేలా ప్ర‌త్యామ్నాయ ఏర్ప‌ట్లు చేస్తోంది ప్ర‌భుత్వం. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu