ఉద్యోగులను ఊరించి.. షాకిచ్చి..! పీఆర్సీ ఇక లేనట్టే..!
posted on Feb 11, 2021 3:25PM
ఆశ.. దోశ.. అప్పడం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఇదే పాట పాడుకుంటున్నారు. వేతన సవరణపై కేసీఆర్ ప్రకటన కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు.. ఊహించినట్లే షాక్ తగిలింది. రేపు మాపో పీఆర్సీపై ప్రకటన చేస్తామంటూ సర్కార్ ఊరిస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రావడంతోనే .. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో పీఆర్సీ ప్రకటన అటకెక్కింది. తెలంగాణ ఉద్యోగులను నిరాశలో ముంచింది. కేసీఆర్ సర్కార్ కావాలనే పీఆర్సీ ప్రకటనపై ఆలస్యం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.
పీఆర్సీతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ చాలా కాలంగా తెలంగాణ ఉద్యోగులు పోరాడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మే18, 2018న సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ వేసింది. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో కమిషన్ గడువును పెంచింది. సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు 31 నెలల తర్వాత 2020 డిసెంబర్ 31న సీఎస్ సోమేశ్ కుమార్‌కు నివేదిక ఇచ్చింది బిశ్వాల్ కమిటి. పీఆర్సీ నివేదికను జనవరి 27న ప్రభుత్వం విడుదల చేసింది.
ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును కమిటి ప్రతిపాదించింది బిశ్వాల్ కమిటి. కనీస వేతనం రూ.19వేలు,గరిష్ఠ వేతనం రూ.1,62,700గా ఉండాలని సూచించింది. సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది. పీఆర్సీ కమిటి ప్రతిపాదనలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.
అయితే పీఆర్సీ కమిటి ఇచ్చిందే ఫైనల్ కాదని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవప్రధానంగానే ఇస్తారని నమ్మకం వ్యక్తం చేసింది. కేసీఆర్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ గత నెల 27 నుంచి చర్చలు మొదలుపెట్టింది. ఇంతలోనే అన్ని సంఘాలతో చర్చలు జరపాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని ప్రకటించింది. తెలంగాణలో దాదాపు 150కిపైగా ఉద్యోగ సంఘాలున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల డిమాండ్లనే సాకుగా చూపి ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యం చేసే ఆలోచనతోనే.. సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి.
ఉద్యోగులు భయపడుతున్నట్లుగానే జరిగింది. సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఎన్నికలు ముగిసేవరకు పీఆర్సీ ప్రకటన లేనట్టే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ రావచ్చని చెబుతున్నారు. అదే జరిగితే పీఆర్సీ ప్రకటనకు మరి కొంత సమయం ఆలస్యం కానుంది. జనవరి నుంచి పీఆర్సీ ప్రకటన కోసం అశగా ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు భగ్గుమంటున్నారు. పీఆర్సీ ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారీగానే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయబోతున్న అధికార పార్టీ అభ్యర్థులు కూడా కలవరపుడుతున్నారని చెబుతున్నారు.