తెలుగుదేశం వైపు కేసీఆర్ చూపు?

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. ఇంకా కుదరకపోతే ఎదుటి పార్టీని చీల్చు.. ఆవిర్బావం నుంచీ తెరాస రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఇదే పంథాలో సాగాయి. తన లక్ష్యసాధన కోసం..అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా చేస్తానని కేసీఆర్ అప్పట్లో చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసింది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ తరువాత అన్ని పొత్తులనూ వదులుకొని విమర్శలు గుప్పించింది.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత కొత్త రాష్ట్రంలో (తెలంగాణ) కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపిన సంగతి విదితమే. ఇప్పుడు కొత్త  జాతీయ పార్టీని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్.. అవే పాత వ్యూహాలు, ఎత్తుగడలతో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తనకు జాతీయ పార్టీ విషయంలో అండగా నిలిచే పార్టీలను, వ్యక్తులను గాలించే పనిలో పడ్డారు. దేశ వ్యాప్తంగా క్రియాశీలంగా ఉన్న ఏ ఒక్క నాయకుడూ, ఏ ఒక్క పార్టీ ఆయనతో కలిసి అడుగులు వేయడానికి సుముఖత చూపకపోవడంతో.. ఆయన చూపు ఏపీ వైపు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం వైపు మళ్లిందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ పని చేసిన సంగతి విదితమే.

అప్పట్లో తన కున్న పరిచయాలను ఇప్పుడు ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. తెరాస ఆవిర్భావం తరువాత, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితులైనది తొలుత తెలంగాణలోని తెలుగుదేశం నాయకులే.ప్రస్తుతం తెరాసలో కీలకంగా ఉన్న వారిలో అత్యధికులు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.. అదే దారిలో ఇప్పుడు ఆయన ఏపీలోని తెలుగుదేశం నాయకులకు గాలం వేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. ఎర్రబెల్లి కూడా మాజీ తెలుగుదేశం నాయకుడేనన్న సంగతి విదితమే.

గతంలో టీఆర్ఎస్ లోకి తెలంగాణ తెలుగుదేశం నాయకులను ఆకర్షించిన విధంగానే ఇప్పుడు తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆయన ఏపీ తెలుగుదేశం నాయకులను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పెద్దగా చురుకుగా లేని నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా ఆయన టార్గెట్ అంతా మాజీ ఎంపీలపై ఉందని అంటున్నారు. తన కొత్త పార్టీ తరఫున  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ అభ్యర్థులను నిలపాలని భావిస్తున్న కేసీఆర్ ముందుగా అందుకు అభ్యర్థుల గాలింపు కోసం ఏపీని, అందులోనూ తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కడప జిల్లాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని చెబుతున్నారు.

ఇప్పటికే తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆ జిల్లాలకు చెందిన కొందరు తెలుగుదేశం నాయకులకు కేసీఆర్ నుంచి పిలుపు వెళ్లిందని అంటున్నారు. ఏపీలో తన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కు మార్గం సుగమం చేసే దిశగా కేసీఆర్ గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో సుదీర్ఘ భేటీ జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక తెరాస మంత్రులు, నాయకులూ కూడా తరచూ ఏపీపైనా, ఏపీలో పరిస్థితులపైనా చేసిన, చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఏపీలో సానుకూలత ఏర్పరిచే వ్యూహంలో భాగమేనని అంటున్నారు.  

ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ లో తనతో కలిసి పని చేసిన నేతలకు కేసీఆర్ నుంచి ఆహ్వానం వెళ్లిందని అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారా? పెట్టరా అన్న అనుమానాలు ఉండేవి. కానీ ఈ నెల 2 (ఆదివారం) ఆయన పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో ఆయన ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేసేశారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసేశారు. తాను స్థాపించనున్న జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు.

డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. తాను స్థాపించబోయే కొత్త జాతీయ పార్టీ ఎదుర్కొనే తొలి ఎన్నిక మునుగోడే అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో తన కొత్త జాతీయ పార్టీ శుభారంభం చేస్తుందని ఆయన భావిస్తున్నారు.  ఇక అసలు విషయానికి వస్తే ఏపీలో పాగా వేయాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు.కొంత కాలంగా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ ఏపీలోనూ విస్తరిస్తుందని, ఆ రాష్ట్రంలోనూ తాము రాజకీయం చేస్తామనీ చెబుతూ వస్తున్నారు. అంతెందుకు ఏపీలో పాలన అధ్వానంగా ఉందని, సమయం వచ్చినా రాకున్నా, సందర్భం అయినా కాకున్నా విమర్శలు గుప్పిస్తున్నారు.  
ఏపీ నుంచి తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు లభిస్తుందన్న ఆశతో కేసీఆర్ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంద్రులపై విద్వేష పూరిత వ్యాఖ్యలు, విమర్శలతో చెలరేగిపోయి,

ఆ తరువాత రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా ఏపీకి విభజన చట్టం ప్రకారం న్యాయంగా ఇవ్వాల్సిన వాటికి, రావాల్సిన వాటికీ అడుగడుగునా అడ్డం పడుతున్న కేసీఆర్ కు ఏపీ నుంచి ఏ విధమైన మద్దతైనా వస్తుందా అన్న అనుమానాలను అయితే పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీలోని వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా లోపాయికారీ మద్దతు ఇస్తూ, ఆ ప్రభుత్వాధినేత బలహీనతలను ఆసరాగా తీసుకుని అడుగడుగునా ఏపీపై విమర్శలు గుప్పిస్తున్న టీఆర్ఎస్ పైనా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనా ఏపీలో సానుకూలత వ్యక్తం అవుతుందా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలుపునకు, ఆహ్వానానికీ ఏపీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్నది చూడాల్సింది. ఇప్పటికైతే కేసీఆర్ ఆహ్వానానికి ఏపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాలేదనే చెబుతున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu