అటోఇటో ఇవాళ తేలిపోనుంది... కేసీఆర్-జగన్ మీటింగ్ డిటైల్స్ పై ఉత్కంఠ.!

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ముచ్చటగా మూడోసారి సమావేశంకానున్నారు. ప్రగతిభవన్లో భేటీకానున్న కేసీఆర్-జగన్... గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించే అంశంపై ముఖ్యమంత్రులిద్దరూ దృష్టిపెట్టనున్నారు. రాయలసీమకు గోదావరి జలాల తరలింపు విషయంలో సహకరిస్తానని ఇప్పటికే కేసీఆర్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకే కాకుండా, తెలంగాణలోనూ పలు ప్రాంతాలను సాగునీరు అందుతుందనే నిర్ధారణ తర్వాతే ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే, శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపు ప్రతిపాదనలపై ఇరురాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు ఇప్పటికే విస్తృతంగా చర్చించి, ప్రతిపాదనలను సీఎంలకు అందజేశారు. దాంతో, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

అయితే, భేటీకి ముందే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.... సమావేశ అజెండాపై మాట్లాడి ఖరారు చేశారు. గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, తొమ్మిది అండ్ పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశాలపై చర్చించాలని డిసైడ్ చేశారు. అలాగే, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఆదాయ వనరుల సమీకరణ, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం వైఖరిపైనా చర్చించనున్నారు.

అయితే, తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజనపై ఇప్పటికే ముఖ్యమంత్రులిద్దరి మధ్యా సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. కానీ కొందరు అధికారుల అత్యుత్సాహం, అనధికార ప్రకటనలు, సరైన సమాచారం లేకుండా ఉత్తర్వులు ఇవ్వడంతోనే, నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మీటింగ్ తర్వాత తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల విభజనపై పూర్తి స్పష్టత ఇస్తారనే మాట వినిపిస్తోంది.