ప్రాణం తీసిన మెట్రో స్టేషన్‌ గోడ పెచ్చులు.. ఇదేనా గొప్పలు చెప్పుకున్న నిర్మాణం?

 

వర్షంలో తడవకుండా ఉండాలని మెట్రో పిల్లర్ కింద నిల్చున్న పాపానికి.. పై నుంచి పెచ్చులు ఊడి పడి ఓ వివాహిత మృతి చెందిన ఘటన అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. మృతురాలిని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న మౌనిక (26)గా గుర్తించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌. భర్త కంతాల హరికాంత్‌ రెడ్డి. ఏడాది క్రితమే వీరికి పెళ్లయింది. కూకట్‌పల్లి ఫేజ్‌- 3 ఎస్‌ఆర్‌ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. 

తన బాబాయ్ కూతురు నిఖితను అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్లో చేర్పించేందుకు ఆమెతో కలిసి మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్‌పల్లిలో మెట్రోరైలు ఎక్కింది. మధ్యాహ్నం 2:30 గంటలకు అమీర్‌పేట స్టేషన్ కి చేరుకున్నారు. సారథి స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. వర్షం పడుతుండటంతో ఇద్దరూ ఏ-1053 మెట్రో పిల్లర్‌ కింద నిల్చున్నారు. అయితే అనుకోకుండా మూడో అంతస్తులోని గోడ పెచ్చులు ఒక్కసారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. దాదాపు 9 మీటర్ల ఎత్తునుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె సోదరి, కొందరు స్థానికులు కలిసి బాధితురాలిని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతిచెందినట్లు తెలిపారు. సోదరిని హాస్టల్‌లో చేర్పించి గంటలో తిరిగి వస్తానని తనతో చెప్పి వెళ్లిన భార్య.. కొద్దిసేపటికే తిరిగిరానిలోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్‌ షాక్‌కు గురయ్యాడు. మృతదేహం వద్ద భోరున విలపించాడు.

కాగా ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి, ఏళ్ళ తరబడి కట్టారు. తీరా మెట్రో ప్రారంభమైన కొద్ది నెలలకే ఇలా పెచ్చులు ఊడిపోయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇదేనా మీరు గొప్పలు చెప్పుకున్న నిర్మాణం అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనకు మెట్రో అధికారులే బాధ్యత వహించాలని, మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.