హస్తం హమీల అమలుకు శ్రీకారం ..కానీ

కొంత ఆలస్యం జరిగినా... కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన ఐదు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. నిజానికి, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా మొదలు ఇతర కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుంచే ఐదు హామీలు అమలోకి వస్తాయని హామీఇచ్చారు. రాష్ట మంత్రి వర్గం తొలి సమావేశంలోనే ఆమోదం తెలిపి  మలి రోజు నుంచే అమలులోకి తెస్తామని కాంగ్రెస్ నేతలు  గ్యారెంటీ ఇచ్చారు. అయితే  గత నెల (మే) 20న జరిగిన తొలి మంత్రివర్గంలో, ‘సూత్ర ప్రాయ’ అమోదంతో సరిపెట్టిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య, శనివారం (జూన్ 2)  జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పథకాల అమలుకు మరికొంత సమయం తీసుకున్నారు. అంచెల వారీగా ఒక్కొక పధకాన్ని అమలు చేస్తామని షెడ్యూలు  ప్రకటించారు. అంతే కాదు, తక్షణం అన్న మాటను తుడిచేసి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా  ఐదు హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పు కొచ్చారు. 

శుక్రవారం (జూన్ 2) ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైన ఐదు పథకాలను కన్నడ ప్రజలకు ఉచితంగా అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనతరం ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య పథకాల అమలులో కుల, మత బేధాలు చూడకుండా అర్హులైన అందరు లబ్ధిదారులకు ఉచిత హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.

అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా కాకుండా, చిన్నచిన్న సవరణలు చేశారు. అనీ పథకాలు ఒకేసారి కాకుండా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ముహూర్తం ఖరారు చేశారు. అందులో భాగంగా  ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే.. గృహ జ్యోతి పథకాన్ని జులై 1 నుంచి మలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే, 200 యూనిట్స్ వరకు ఫ్రీ .. అని హమీ ఇచ్చినప్పటికీ, అందులోంచి ఒక యూనిట్ తీసేసి, 199 యూనిట్స్ కు కుదించారు. అంతే కాదు, జులై వరకు ఉన్న విద్యుత్ బిల్లులను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే,  గృహలక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళ యజమానికి నెలకు రూ.2వేల ఆర్థిక సాయం పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభించనున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

అదే విధంగా, అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.'శక్తి' పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.అయితే, ఏసీ, స్లీపర్,రాజహంస బస్సుల్లో ‘ఉచితం’ నడవదని స్పష్టం చేశారు. అలాగే  ప్రతి బస్సులో 50 శాతం సీట్లు పురుషులకు రిజర్వు చేస్తారు. మిగిలిన  50 శాతం సీట్లలో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి కేటాయిస్తారు. ఈపథకం కూడా తక్షణం అమలు కాదు. జూన్ 11 నుంచి అమలు చేస్తారు. 

 అదే సమయంలో 'యువ నిధి' పథకం కింద డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి భృతి చెల్లిస్తామని తెలిపారు.  2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు రూ.3 వేలు.. డిప్లొమా విద్యార్థులకు రూ.1,500. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే ఈపథకం ఎప్పటి నుంచి అమలువుతుంది, అనేది ముఖ్యమంత్రి స్పష్తం చేయలేదు. బహుశా 2022-23 విదా సంవత్సరంలో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధుల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పథకం అమలకావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకు అయితే ఈ పథకం వర్తించదు. కాగా  ఈ పథకాల మలుకు రూ.50,000 (అక్షరాలా 50 వేల కోట్ల రూపాయాలు) ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే రాష్ట్ర బడ్జెట్ లో ఆరింట ఒకవంతు ఉచితాల ఖాతాకు పోతుంది. అదలా ఉంటే, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టి, వెనకడుగు వేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.అయితే  సిద్ధరామయ్య ప్రకటనపై ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది చూడవలసి ఉంది