కన్నడం మాట్లాడకపోతే కొడతారా?
posted on Oct 15, 2014 5:58PM

కర్నాటకలోలోని కోతనూర్‌లో ఓ మణిపూర్ విద్యార్థి మీద కన్నడ భాష మాట్లాడలేదన్న నెపంతో కొంతమంది కన్నడిగులు సామూహిక దాడి చేసి చావబాదారు. ఈ దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపు మీద గాయాలయ్యాయి. అయితే అవేమీ ఆందోళనపడాల్సిన తీవ్రమైన గాయాలు కాదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనలో మైఖేల్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. కన్నడ భాషలో మాట్లాడాలని బలవంతం చేశారని, రాష్ట్రేతరులుగా కర్ణాటకలో పండించిన పంటలను తినడం నేర్చుకున్న మీరు కన్నడ భాషలో మాట్లాడ్డం కూడా నేర్చుకుని తీరాలని, ఇది చైనా కాదని, భారతదేశం అంటూ తమ మీద దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో స్థానిక కన్నడ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.