నేనలా చేస్తే.. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. కల్వకుంట్ల కవిత
posted on Nov 22, 2025 9:47AM
.webp)
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏక కాలంలో రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై విమర్శలు గుప్పిస్తూనే.. మరో వైపు ఫార్ములా ఈకార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి పై మండి పడుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ కు మద్దతు ఇస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చెరువులను ఆక్రమించి పెద్ద ఎత్తున భవనాలు నిర్మించుకుంటున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇలా భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారన్న కవిత.. వీరి విషయంలో హైడ్రా నిద్రపోతోందా అంటు నిలదీశారు.
పేదల ఇళ్లను కూల్చేవేతలో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్న హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.తన వద్ద ఉన్న ఆధారాలను హైడ్రాకు అందించడానికి తాను సిద్ధమే కానీ, తానా పని చేస్తే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపైపోతారని అన్నారు. అలా జంపైపోతే కాంగ్రెస్ వారికి క్లీన్ చిట్ ఇచ్చేస్తుందన్నారు.