జూబ్లీ హిల్స్ బరిలో తెలంగాణ జాగృతి అభ్యర్థి?
posted on Sep 15, 2025 3:40PM

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనడానికి రెడీ అయిపోరాయా? ఇప్పటి వరకూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన కల్వకుంట్ల కవిత.. ఇక నేరుగా కదన రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. త్వరలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని రంగంలోని దించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ఈ విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ విషయంలో ఆమె కీలక నేతలతో చర్చించారని అంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సోమవారం (సెప్టెంబర్ 15) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ జాగృతి తరఫున కల్వకుంట్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. కవితతో భేటీ తరువాత విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణ జాగృతి అధినేత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు చెప్పారు. ఈ భేటీలో తాను కవితను పెద్దమ్మ గుడిలో దసరా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించినట్లుచెప్పారు. తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగ లేదని పేర్కొన్నారు.
ఇలా ఉండగా త్వరలో జరగనున్న బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తరువాత తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాగృతి తరఫున అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఆర్ఎస్ కు గట్టి ఝలక్ ఇవ్వాలన్నపట్టుదలతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.