కడపలో టీడీపీ జెండా ఎగరేద్దాం : శ్రీనివాసులురెడ్డి
posted on Jun 18, 2025 8:17PM

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో జెండా ఎగురవేసేందుకు తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.
బుధవారం ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ కడప నగర సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికి 8 నెలలు కష్టపడి బలంగా, కసిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఆర్ మాధవిరెడ్డిని గెలిపించుకున్నామన్నారు.
అదే స్పూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పనిచేసి కడప నగర కార్పొరేషన్ లో తెలుగుదేశం జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు విడతల వారీగా పదవులు ఇస్తామన్నారు. వచ్చే నెలలో నగరంలోని 50 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేస్తామన్నారు. ఇప్పటి నుంచే అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మెన్ కేశవరెడ్డి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, పార్టీ నాయకులు బి హరిప్రసాద్, ఎస్ గోవర్థన్ రెడ్డి, జిలాని బాష తదితరులు పాల్గొన్నారు.