దుమారం రేపుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు..!
posted on Jun 18, 2025 8:26PM

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. మొదటినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ వంటి వారు తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తోందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.
తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతు చూస్తామని, ఇప్పటినుంచే జైళ్లు రిపేరు చేయించకోవాలని వైసీపీ నేతలు పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది చేతగానితనం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వైసీపీ నేతల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్నారు. మీకు నాలుగేళ్ల సమయం కావాలేమో.. మేము ఇప్పుడే ఉతికితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే చితక్కొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తల వైపు కాకుండా.. వైసీపీ వైపే చంద్రబాబు ఉన్నారన్నారు. కాబట్టే వారు చెలరేగిపోతున్నారన్నారు. వారు ఇలాగే మాట్లాడితే చితగ్గొట్టాలన్నారు. లైన్ దాటి బహిరంగంగా ఆయన అలా పిలుపునివ్వడం, బూతు పదజాలంతో విరుచుకుపడడం, తమ అధినేతకు సైతం పరోక్షంగా చురకలంటించడం వివాదాస్పదంగా మారాయి.