బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవడమే తమ లక్ష్యం : సీఎం రేవంత్‌

 

బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారని తెలిపారు.

ఆ సమావేశంలో హరీష్ రావుగా కూడా పాల్గొన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.  రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఎవరేం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలోనే ఉందన్నారు. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేద్దామని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై టెక్నికల్, లీగల్, పొలిటికల్ గా అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి మా వాదన వివరిస్తామన్నారు. పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు.

ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు.  అయితే ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర వాకౌట్ చేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.