లోకేష్ పాదయాత్రకు రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణ
posted on Feb 6, 2023 9:46AM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం 11వ రోజుకు చేరుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న జనాదరణతో లోకేష్ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగుతోంది. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లును పూర్తి చేసుకొంది.
జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతోన్నారు. అలాగే జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను లోకేష్ ఈ పాదయాత్రలో ఎండగడుతున్నారు. విపక్ష న నేతగా ఉండగా జగన్ చేసిన పాదయాత్రలో నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు.. గద్దెనెక్కిన ఈ మూడున్నరేళ్లలో వాటిని విస్మరించిన తీరును ప్రజలకు కళ్లకు గట్టేలా వివరిస్తున్నారు.
అదే విధంగా జగన్ తీరు కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు.. ఎస్సీ, ఎస్టీలపై అక్రమంగా నమోదవుతున్న కేసులతోపాటు వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై జగన్ సర్కార్ దెబ్బకొట్టిన విధానాన్ని లోకేష్ తన పాదయాత్రలో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. అలాగే దళితలను హత్య చేసి.. మృతదేహాలను సైతం డోర్ డెలివరి చేసే సౌకర్యం కూడా జగన్ సర్కార్ కల్పించిందంటూ సెటైర్లు గుప్పించారు. జగన్ పాలన అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సైతం లోకేష్ జనాలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక లోకేష్ ను కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకునేందుకు జనం పోటీలు పడుతున్నారు. యువత ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దారిపొడవునా మహిళలు హారతులు పడుతున్నారు.
ఇలా అన్ని వర్గాల ప్రజలూ లోకేష్ పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. అదే విధంగా దారిపొడవునా కలిసిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటూ, భవిష్యత్ పై వారికి బరోసా కల్సిస్తూ ముందుకు నడుస్తున్నారు. ఒక వైపు లోకేష్ కు జనం బ్రహ్మరథం పడుతుంటే.. మరో వైపు పోలీసులు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. అనుమతులు లేవంటూ సభలను అడ్డుకోవడం, ప్రచార వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై జనంల ఆగ్రహం వ్యక్తమౌతోంది.