అదిగో.. హోదా వచ్చేస్తోంది(ట)!
posted on Feb 5, 2023 10:25PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సారి కాదు, వందసార్లు స్పష్టం చేసింది. అంతే కాదు హోదా ముగిసిన అధ్యాయం, క్లోస్డ్ చాప్టర్ అని కుండ బద్దలు కొట్టేసింది. మళ్ళీ తెరిచే ప్రశ్నే లేదని ఒకటికి పది సార్లు పార్లమెంట్ వేదికగానే ప్రకటించేసింది. అయినా హోదా హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాలలో కేంద్రాన్ని గట్టిగా అడిగే ‘సాహసం’ చేయలేక పోయింది.
అయితే నాలుగేళ్ళ తర్వాత ఇప్పడు వైసీపీ ఎంపీలు కళ్ళు తెరిచి తగుదునమ్మా అంటూ ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు పెడతామని ప్రకటించారు. అయితే, వైసీపీ ఎంపీలకు ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకు వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ప్రస్తావన చేస్తున్నారు? అంటే, జరగరానిది ఏదో జరగనుందనే ఉప్పందడం వల్లనే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోదా అస్త్రాన్ని పైకి తెచ్చారని వైసీపీ నేతలే అనుమానిస్తున్నారు.
ఓ వంక కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అన్నింటినీ పక్కన పెట్టినా, బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉపేక్షించినా, పూర్తిగా విస్మరించినా, ఒక్కటంటే ఒక్కటైనా మేజర్ ప్రాజెక్ట్ ఏదీ ఏపీకి ప్రకటించక పోయినా, ఏమీ చేయలేక చేతులెత్తేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు హోదా డ్రామాను తెర మీదకు తెచ్చిందని స్వపక్షీయులే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయమే జరిగింది. విభజ హామీల ఉసెత్తలేదు. ఏ రంగానికి కనీస కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతగా వాయిస్ లేని ముగ్గురు ఎంపీలను (రంగయ్య, రెడ్డప్ప, పిల్లి సుభాష్’) మీడియా ముందుకు పంపారు.
పార్లమెంట్‌లో సైలెంట్ గా ఉండి.. బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కనీసం మద్దతు కూడా ఇవ్వని వైసీపీ ఎంపీలు మీడియా ముందుకు వచ్చి విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అన్ని అంశాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని గంభీర ప్రకటన చేశారు. ఈ ముగ్గరు ఎంపీల మాటను ప్రభుత్వం సీరియస్ గా తీసు కుంటుందనే నమ్మకం ఇతరులకే కాదు, కనీసం ఆ ప్రకటన చేసినముగ్గురు ఎంపీలకూ కూడా లేదని వేరే చెప్పనక్కర్లేదని అంటున్నారు. నిజానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసీ ముగియక ముందే, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ‘బడ్జెట్ బ్రహ్మాండం’ అంటూ కితాబు నిచ్చారు. కానీ ఇప్పడు వైసీపీ ఎంపీలు మాత్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని.. ఏం అడిగినా పట్టించుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు తెస్తామని, ఉత్తుత్తి ప్రకటనలు గట్టిగా చేస్తున్నారు. అయితే వైసీపీ ఎంపీలు తమను తాము మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు కావచ్చును. కానీ, ప్రజలు మరీ అంత అమాయకులు కాదని అంటున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే హోదా విషయంలో చేతులెత్తేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో చేతులెత్తి వేడుకోవడం మినహాయించి చేసేదేమీ లేదని చెప్పేశారు. ఆ తర్వాత గడచిన నాలుగు సంవత్సరాలలో హోదా కోసం చేసిన గట్టి ప్రయత్నం ఏదీ లేదు. కానీ ఇప్పడు మెల్లిగా హోదాకోసం ప్రైవేటు బిల్లు పెడతామని ఎంపీలు చెప్పుకోవడం ఆత్మ వంచన తప్ప మరొకటి కాదు. ఆవిషయం వారికీ తెలుసు ... ప్రజలకు తెలుసు.