జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ 3వ విడత పోలింగ్
posted on Dec 9, 2014 10:05AM

జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు మూడో దశ పోలింగ్ మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. కాశ్మీర్ పోలింగ్‌లో ఈ దశలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు మంత్రులు కూడా బరిలో వున్నారు. ఈ దశలో మొత్తం 16 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 144 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ జరగనివ్వమంటూ ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. కాశ్మీర్లోయలో శుక్రవారం ఉగ్రవాదులు దాడితో జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఎన్నికల జరిగే ప్రాంతాలలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. అదేవిధంగా అలాగే జార్ఖండ్లో ఈ దశలో 17 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 289 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. వీరిలో 103 మంది స్వతంత్ర అభ్యర్థులే. ఈ మూడో విడతలో మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీతోపాటు ముగ్గురు మంత్రుల తలరాతను ఓటర్లు రాయబోతున్నారు.