పార్టీనా లేక‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా..? తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి కలకలం..

మూడు గ్రూపులు.. ఆరు గొడవలు. ఇదీ కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న సంస్కృతి. వర్గపోరుతోనే కాంగ్రెస్ పార్టీ బలహీనమైందనే చర్చ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లోనూ అదే పరిస్థితి. నాయకుల తీరు వల్లే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నా.. అధికారంలోకి రాకలేకపోయిందనే అభిప్రాయం ఉంది. గత ఏడేండ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా దిగజారింది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో ఒక్కసారిగా పుంజుకుంది.

రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలు, అధికార పార్టీపై ఆయన చేస్తున్న ఆరోపణలతో  కాంగ్రెస్ కేడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేవంత్ రాకతో కాంగ్రెస్ వేగంగా బలపడుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా మళ్లీ నేతల తీరే ఆ పార్టీకి గండంగా మారుతోంది. కేడర్ పుల్ జోష్ లో ఉన్న సమయంలో కొందరు నేతలు తమ కామెంట్లతో పార్టీలో రచ్చ రాజేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ ముఖ్య నేత‌ల వ‌ద్ద జ‌గ్గారెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని జ‌గ్గారెడ్డి అన్నారు. జ‌హీరాబాద్ వ‌స్తున్న‌ట్లు క‌నీసం గీతారెడ్డికి కూడా స‌మాచారం లేదని, వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికే ఆరాట‌ప‌డితే పార్టీలో కుద‌ర‌దని చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు వ‌స్తున్న‌ట్లు త‌నకు స‌మాచారం లేదని, విభేదాలు ఉన్నాయ‌ని చెప్పేందుకు స‌మాచారం ఇవ్వ‌ట్లేదా? అని ఆయ‌న నిల‌దీశారు. పార్టీలో సింగిల్‌ హీరోగా ఉండాల‌నుకుంటే కుదరదని చెప్పారు. ఒక్కరి ఇమేజ్‌ కోసం మిగతా వారిని తొక్కే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు జగ్గారెడ్డి. ఇది పార్టీనా లేక‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీనా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పార్టీ నేత‌ల‌తో చర్చించకుండానే కార్య‌క్ర‌మాలు ఖ‌రారు చేసుకోవ‌డం ఏంట‌ని జగ్గారెడ్డి నిల‌దీశారు. ముందే ప్రోగ్రాంలు ఫిక్స్‌ చేయడమేంటని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ కాకముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి అన్నారు.  సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ సభాపక్షం సమావేశానికి ముందు జగ్గారెడ్డి చేసిన కామెంట్ల కాక రేపుతున్నాయి. గతంలోనూ రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు జగ్గారెడ్డి. ఈసారి కొంత ఘాటు పెంచడంతో కాంగ్రెస్ లో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది. 

Related Segment News