ఏపీ వదిలి తెలంగాణకు వస్తా! సీఎం కేసీఆర్ తో జేసీ చర్చ.. 

జేసీ దివాకర్ రెడ్డి... తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ లీడర్. ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన జేసీ దివాకర్ రెడ్డి... రాష్ట్ర విభజన తర్వాత 2014లో అనంతపురం ఎంపీగా పని చేశారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి... తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని చెబుతారు. అందుకే ఏ విషయంలోనైనా తన వైఖరికి కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. అందుకే జేసీ వ్యాఖ్యలు ఎక్కువగా వివాదాస్పదమవుతుంటాయి.

ప్రజా సమస్యలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలోనూ జేసీ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండేవారు. విభజన సమయంలో ఆయన తెరపైకి తెచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ అంగీకరించకున్నా చివరి వరకు ఆయన అదే స్టాండు కొనసాగించారు. విభజన తర్వాత కూడా పలు సార్లు రాయల తెలంగాణ గురించి మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అసెంబ్లీకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. పలు అంశాలపై ఆయనతో ముచ్చటించారు.  సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానని చెప్పారు.  ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసన్నారు జేసీ. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదన్నారు. రాజకీయాలు బాగోలేవు.. సమాజం కూడా బాగోలేదని జేసీ కామెంట్ చేశారు. 

విభజన సమయంలో తెరపైకి తెచ్చిన రాయల తెలంగాణపైనా మరోసారి మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానని అన్నారు. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం..  రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని జేసీ కామెంట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ఇక ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం ముదురుతున్న సమయంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.