టీటీడీలోకి అంబానీ ఎంట్రీ! జగనన్న సేల్ పాలసీనా? 

కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. అడ్డగోలుగా ప్రభుత్వ సంస్థ అమ్మకానికి సిద్ధపడుతోంది. భూముల అమ్మకంతో పాటు కీలకమైన సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రయత్వాలు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే మరో అడ్డగోలు అమ్మకానికి సిద్ధమైంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల కొండను కూడా వదలడం లేదు. తిరుమల మీద ఆధిపత్యాన్ని రిలయన్స్ అధినేత మఖేష్ అంబానీ చేతికి అప్పగించాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. అంబానీ కంపెనీకి చెందిన జియో సంస్థకు టీటీడీ దర్శనం టికెట్ల వెబ్‌సైట్‌ను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.  

కరోనా నేపథ్యంలో తిరుమలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో  శ్రీవారి దర్శనానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ.. ఒకేసారి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. గతంలో ఈ బాధ్యతలను టీసీఎస్ అనే సంస్థ నిర్వర్తిస్తూ ఉండేది. టికెట్ల కోసం భక్తులు భారీగా ఎగబడుతుండడంతో కొద్ది నెలలుగా సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీనిపై భక్తుల నుంచి పలు ఫిర్యాదులు వస్తుండడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. టీటీడీ అధికారులు జియోను సంప్రదించినట్లు చెబుతున్నారు. దీనిపై స్థానికంగా ఉన్న ముఖేష్ అంబానీ సన్నిహితులతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు మాట్లాడినట్లు తెలిసింది.ఈ క్రమంలో టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో వెబ్‌సైట్‌లో జియో మార్ట్ అనే లోగో కనిపించడంతో భక్తులు షాక్‌కు గురయ్యారు.

ఏపీలోని అన్నింటినీ ఆదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తిరుమల టికెట్ల వెబ్‌సైట్‌ను జియోకు అప్పగించడం.. తీవ్ర దుమారాన్ని రేపుతోంది. టీటీడీ వెబ్ సైట్ లో జియో మార్ట్ లోగో ఉండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థ... ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వివిధ వస్తువులు అమ్మే జియో మార్ట్‌లో తిరుమల టికెట్లు అమ్మడం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీటీడీ వేదికగా జియోకు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అంతర్జాతీయంగా పేరున్న టీసీఎస్ సంస్థ చేయలేని పని.. జియో చేస్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

శ్రీవారి దర్శనం టికెట్లు తీసుకునేందుకు క్లిక్ చేస్తే.. జియో మార్ట్‌లోకి వెళ్లి, అక్కడి వస్తువులను చూపిస్తోందని వాపోతున్నారు. దీంతో టీటీడీ నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రశ్నిస్తే.. సాఫ్ట్‌వేర్ లోపాల కారణంగానే జియోకు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే జియోకు తిరుమల టికెట్ల బాధ్యతలు ఇవ్వడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.