రోశ‌య్యకు జగన్ నివాళులు.. తెర‌వెనుక పెద్ద క‌థే ఉంది!?

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొండితనానికీ, తనమాటే నెగ్గాలన్న మంకుపట్టుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు.. కాదుకాదు.. కుందేలుకు నాలుగు కాళ్లు అని ఆయ‌న‌కు వివ‌రంగా చెప్పేందుకు ఎవ‌రు ప్ర‌య‌త్నించినా  వారి అంతుచూసే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రు. దీంతో జ‌గ‌న్   గురించి తెలిసిన వైసీపీ నేత‌లు ఏ విష‌యంలోనూ ఆయ‌న‌కు స‌ల‌హా ఇచ్చేందుకు, త‌ప్పుచేస్తున్నారని చెప్పేందుకు సాహ‌సం చేయ‌రు. అధికారంలోకి రాక‌ ముందు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న అలానే ఉంటూ వ‌చ్చింది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విచిత్ర నిర్ణ‌యాల‌తో వైసీపీ నేత‌ల‌కు చాలా సార్లు త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టారు. అధికారంలో ఉన్నాం క‌దా అని చాలా మంది వైసీపీ నేత‌లు స‌ర్దుకుపోతూ వ‌చ్చారు. జ‌గ‌న్ తన మొండితనంతో తీసుకున్న నిర్ణ‌యాల‌తో చివ‌రికి వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ర‌దాలు క‌ట్టుకొని స‌భ‌ల‌కు వెళ్ల‌డం, రైతుల పాస్ పుస్త‌కాల‌పై తన బొమ్మలు ముద్రించుకోవడం, స‌చివాల‌యాన్నికూడా తాక‌ట్టు పెట్టి అప్పులు తేవ‌డం, ఓ కులంపై క‌క్ష‌ పూరితంగా వ్య‌వ‌హ‌రించడం, అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఇలా త‌న అసంబద్ధ నిర్ణయాలతో పార్టీ ఓటమికి, ఆయననే నమ్ముకున్న నేతల పరాజయానికీ జగన్ కార‌ణ‌మ‌య్యారు.

అయితే ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిన తరువాత  కూడా జగన్ తన అసంబద్ధ నిర్ణయాలతో    పార్టీని మరింత పతనం దిశగా నడిపిస్తున్నారు. ఈ మాట పలు సందర్భాలలో వైసీపీయులే బాహాటంగా చెప్పారు. అయితే ఇప్పుడు అంటే పూర్తిగా చేతులు కాలిపోయిన తరువాత ఆకుల కోసం వెతికిన చందంగా జగన్ లో కొంత మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలో సెలెక్టివ్ గా కొందరి మాటలకు ఇప్పుడు జగన్ ఎంతో కొంత విలువ ఇస్తున్నారని అంటున్నారు. వారి సలహా మేరకు అప్పుడప్పుడు నడుచుకుంటున్నారని ఉదాహరణలు చూపుతున్నారు.     మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ జ‌గ‌న్ ట్వీట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ జగన్ లో మార్పునకు ఇదే తార్కానం అని అంటున్నారు. జ‌గ‌న్ స్వ‌భావం ప్ర‌కారం ఆయన ఇలా రోశయ్యకు నివాళులర్పించడం మామూలు పరిస్థితుల్లో అయితే జరగదు. తనకు ఇస్టం లేని నేతల మరణం సందర్భంగా ఆయన ఇలా నివాళులర్పించిన సందర్భాలు గతంలో లేవు.   

జగన్ ఏ మాత్రం దాపరికం లేకుండా అయిష్టతను బాహాటంగా ప్రదర్శించే నేతలలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఒకరు.  జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి రోశ‌య్య సన్నిహితులు. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అనేక సంద‌ర్భాల్లో రోశ‌య్య చెప్పిన సూచ‌న‌లు వైఎస్ తు.చ. త‌ప్ప‌కుండా పాటించేవారు. ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే జగన్ మాత్రం రోశయ్యకు దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం తనను కాదని రోశయ్యను సీఎం చేయడంతో జగన్ రోశయ్యపై కోపం, అయిష్టతా పెంచుకున్నారని వైసీపీ వర్గీయులే చెబుతుంటారు. అందులో భాగంగానే  రోశయ్య మరణించిన సమయంలో జగన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కూడా వెళ్లలేదు.    ఆ త‌రువాత కాలంలో రోశ‌య్య జ‌యంతి, వ‌ర్ధంతిల‌కు  నివాళుల‌ర్పించిన దాఖ‌లాలు లేవు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి చెందిన వారినికూడా జ‌గ‌న్‌ పెద్ద‌గా ద‌గ్గ‌ర‌కు రాణిచ్చేవారు కాద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అధికారం కోల్పోయిన త‌రువాత ఇప్పుడు జ‌గ‌న్ కు రోశ‌య్య గుర్తుకు రావ‌డం, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్ చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.  

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రోశ‌య్య‌ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేత‌లు రోశ‌య్య విగ్రహం పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలకూ జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో రోశ‌య్య‌పై జ‌గ‌న్‌కు ఉన్న కోపాన్ని కొంద‌రు వైసీపీ నేత‌లు ప్ర‌త్య‌క్ష్యంగా చూశార‌ని చెబుతారు. దీనికి కారణం వైఎస్ చనిపోయిన తర్వాత హైకమాండ్ రోశయ్యను సీఎంగా చేయడమే. తనను కాదని రోశయ్య సీఎం పదవి తీసుకున్నారన్న కోపం ఉంది. రోశ‌య్య సీఎం అయిన త‌రువాత ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేందుకు జ‌గ‌న్ అనేక ప్ర‌య‌త్నాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ఆయ‌న కోవ‌ర్టుల ద్వారా రోశ‌య్య‌ను అనేక ర‌కాలుగా జ‌గ‌న్ ఇబ్బందుల‌కు గురిచేశార‌ని అప్ప‌ట్లో కొంద‌రు కాంగ్రెస్‌ నేత‌లు మీడియా ముఖ్యంగానూ ప్ర‌స్తావించారు. జగన్ పెట్టిన ఇబ్బందుల కారణంగానే రోశ‌య్య సీఎం పదవి వదిలేసుకున్నార‌ని అప్పట్లో రాజకీయవర్గాలలో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ హైక‌మాండ్ సీఎంగా చేసింది. అయితే, రోశ‌య్య మ‌ర‌ణించిన స‌మ‌యంలోనూ ఆయ‌న పార్దివ దేహానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించేందుకు వెళ్ల‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ, అధికారంలో ఉన్న స‌మ‌యంలోనూ రోశ‌య్య మాట ఎత్తితే జ‌గ‌న్‌ కోప‌గించుకునేవాడ‌ట‌. 

ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత జ‌గ‌న్ రెడ్డి తొలిసారి రోశయ్యను గుర్తుచేసుకోవ‌టం ఏపీ ప్ర‌జ‌ల‌నూ, వైసీపీ శ్రేణుల‌నూ కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.   మా కుటుంబానికి ఆప్తుడు అయిన రోశయ్యకు వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని జ‌గ‌న్  ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన రోశయ్యకు నివాళులర్పించడంపై నెటిజనులు మండిపడుతున్నారు.  సీఎం పదవిలో ఉన్నప్పుడు రోశయ్యకు ఒక్కసారికూడా ఎందుకు నివాళులు అర్పించలేదని  నిలదీస్తున్నారు.  అది పక్కన పెడితే ఇప్పుడు హఠాత్తుగా జగన్ కు రోశయ్యపై అభిమానం, ప్రేమ పొంగుకు రావడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి దగ్గర కావడానికీ, వారి సానుభూతి పొందడానికే జగన్ ఇప్పుడు రోశయ్యను గుర్తు చేసుకుంటున్నారనీ, ఆయన తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడని చెప్పుకుంటున్నారనీ అంటున్నారు.