మీరే అండా దండా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశానికి జగన్ సన్నాహాలు!

అప్పు చేసి బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడమే పాలన అన్నట్లుగా గత నాలుగున్నరేళ్లుగా గడిపేసిన ముఖ్యమంత్రి జగన్ ను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అధికారంలో ఉన్న  వైసీపీని పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.  పడకేసిన అభివృద్ధి, అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చెప్పిన డైలాగులు, విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరిట పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను విస్మరించి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులు, నానాటికీ దిగజారిపోతున్న   కొనుగోలు శక్తి.. ఇలా అన్నీ లెక్కలేసుకున్న ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

దీంతో మీకు ఇచ్చిన ఒక్క చాన్సే ఎక్కువ.. ఇప్పటిదాకా మీరు నొక్కిన బటన్లు చాలు.. ఇక ఎన్నికలు రాగానే మేం బటన్ నొక్కి ఇంటికి పంపిస్తాం అంటూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ప్రతిపక్ష నేతల పర్యటనలు, సభలలో ప్రజా స్పందనలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన జగన్ విపక్ష నేతలను తిరగనీయకుండా చేస్తే చాలని భావించారు. ఆ కారణంగానే   కక్షకట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయిం చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూ అరెస్టు చేయిద్దామనుకున్నా ఆయన కోర్టును ఆశ్రయించడంతో అది వీలు కాలేదు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలకు దిగుతుంటే ఆంక్షలు విధించి  ప్రజా నిరసనాగ్రహాన్ని అణచివేయాలని చూశారు. దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

దీంతో సీఎం జగన్ ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలా అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ప్రతినిధులతో సమావేశమైన జగన్.. ఏపీకి జగనే ఎందుకు కావాలి? అంటూ ఓ కొత్త కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. అలాగే సీఎం జగన్ స్వయంగా 4 వేల మంది  పార్టీ ద్వితీయ  శ్రేణి నేతలతో సమావేశం కావాలని ప్రణాళికలు రచించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  అక్టోబర్ లో ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.  పార్టీ అధిష్టానం నుండి ఇప్పటికే దీనిపై ఆదేశాలు కూడా వెళ్లాయని చెబుతున్నారు. మేథోమథనం సదస్సు పేరుతో అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో  నిర్వహించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలను ఈ సమావేశానికి తరలించనున్నారట.

అభ్యర్థి ఎంతటివాడైనా,  పార్టీ తరపున అభ్యర్ధులు గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతల మద్దతు చాలా అవసరం. వీరి అండ లేకుండా  పార్టీ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదు.  నగదు పంపిణీ నుండి కుల సమీకరణ ఆధారంగా ఓటర్లను పోగేయడం వరకూ అన్నీ ద్వితీయ శ్రేణి నేతల చేతుల మీదనే జరుగుతుంది. అందుకనే ఇలాంటి సుమారు 4 వేలమంది ద్వితీయ శ్రేణి నాయకులను నేతలను గుర్తించి ఈ సమావేశానికి పిలిచినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో సీఎం జగన్ ఈ సమావేశంలో ఈ 4 వేల మందికి వివరిస్తారని చెబుతున్నారు. అలాగే పనిలో పనిగా ఆయా  నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల అభిప్రాయం, అక్కడ ఈసారి పోటీచేసే   వారి విజయావకాశాలు ఇలా అన్ని విషయాల మీద జగన్ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంపై వైసీపీ వర్గాలలో  ఆసక్తిగా వ్యక్తమౌతోంది.

నిజానికి వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుయాయులూ  ఈ నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నారనీ,  నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న తాము మాత్రం తీవ్రంగా నష్టపోయామనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ప్రభుత్వం వచ్చిన కొత్తలో చిన్నా చితకా పనులు చేసినా వాటి బిల్లులు మాత్రం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ తరువాత అప్పులమోతతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించే పరిస్థితులు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టి అప్పులపాలైన నేతలు.. ప్రభుత్వం వచ్చాక ఏదొక పని  చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని చూసినా.. చెప్పుకొనేందుకు ఒక్క పని కూడా దక్కలేదు. చేసిన పనులకు బిల్లులూ రాలేదు. దీనికి తోడు  గ్రామ, మండల స్థాయి నేతలు తమకి అది కావాలి.. ఇది కావాలి అంటూ పలుమార్లు విన్నపాలు చేసుకున్నా నిధుల కొరతతో ఆ పనులు కూడా చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు వారికి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ ఫలితమే గడపగడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నేరుగా తగిలిన నిరసన సెగలు అని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఏపీకి మళ్లీ జగనే  కావాలో ప్రజలకు చెప్పమంటే ఏం చెప్పాలంటూ ద్వితీయ స్థాయి నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన సమావేశంలో జగన్ ఏం చెప్పనున్నారు? అందుకు నేతలు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తిగా మారింది.