జగనే ఎందుకు?.. నిలదీస్తున్న జనం

 ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు. కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలను ప్రజలు మరిచి పోతారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అంతే కాదు  అలా ఎవరైనా అనుకుంటే వారు అమాయకులు అవుతారు లేకుంటే అజ్ఞానులు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో  తెలియదు కానీ అయన మాత్రం అలాంటి భ్రమల్లో నే ఉన్నారని చెప్పక తప్పదు.  కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని ఆయన చూడలేక పోతున్నారు.

నిజానికి నాలుగున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో  రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు .  ఇలా ఎటు చుసినా అష్టమ దిక్కే దర్శనమిస్తోంది. 

అవి చాలవన్నట్లు జగన్ రెడ్డి  కుట్ర పూరితంగా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.  చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ... గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు.  చెంపలేసుకుని మరీ చేసిన తప్పు  మళ్ళీ చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

నిజానికి  చంద్రబాబు అరెస్ట్ కు ముందే రాష్ట్ర ప్రజలు  జగన్ రెడ్డి అరాచక అవినీతి పాలనకు స్వస్తి చెప్పాలనే  నిర్ణయానికి వచ్చేశారు.  ఇక చంద్ర బాబు అరెస్ట్ తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయాన్నిబహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జనం రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ముగింపు పలికే శుభ ఘడియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత కాలం సంక్షేమం పేరుతో తమ వద్ద ముక్కుపిండి వసూలు చేసిన సొమ్మునే బటన్ నొక్కి తమకే పందేరం చేసిన జగన్ కు ఎన్నికలలో తామే బటన్ నొక్కి  సాగనంపేందుకు ఎదురు చూస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు.

 క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే  జగన్ రెడ్డి మాత్రం ఇంకా  పగటి కలలు  కంటున్నారు. ఇప్పటికీ వై నాట్ 175... భ్రమల్లోనే ఉన్నారు. నిజానికి  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న గడప గడపకు వైస్పీ ప్రభుత్వం, నువ్వే మా నమ్మకం కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి,  తలుపులు తడుతూనే ఉన్నారు. అయినా  ఫలితం లేదు. ప్రజలు చీత్కారాలు, చీవాట్లు భరించ లేక చాలా వరకు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అయితే జగన్ రెడ్డి ప్రతి మూడు నాలుగు నెలకు ఒకసారి గడప గడపకు సమీక్ష పేరున, ఈ కార్యక్రమం ద్వారా ఏదో బ్రహ్మాండం జరిగిపోతోందనే భ్రమలు సృష్టిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు,  జగన్ రెడ్డి  తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను ఉపయోగించుకుంటున్నారు. 

తాజాగా రెండు రోజుల క్రితం మళ్ళీ  అదే క్రతువును కానిచ్చారు. యథాతధంగా, తన గొప్పలు తనే చెప్పుకున్నారు. తన భుజాలను తానే చరుచుకున్నారు. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. ఇంతవరకు చేసింది ఒకెత్తు, రానున్న ఐదారు నెలలు నెలలు మరో ఎత్తు.రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలంటూ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారు. అంతే కాదు. మళ్ళీ జగనే ..ఎందుకు కావలి? అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే మళ్లీ జగన్ ఎందుకు వద్దంటే వంద కారణాలు చెప్పగలం, ఎందుకు కావాలంటే ఏమి చెపుతామని, వైసీపీ నేతలే సైటైర్లు వేస్తున్నారు. నిజానికి, ఇప్పటికే, ప్రజాదరణ పూర్తిగా కోల్పయిన జగన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా, ఇంటికి వెళ్ళడం ఖాయం అన్నదే జనవాక్యంగా వినిపిస్తోంది. అందుకే  జనం అవును జగన్  ఎందుకు ? వద్దే వద్దు అంటున్నారు . ఏపీకి జగన్ అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.