కోడి కత్తి శీను కోసం రంగంలోకి అయేషా మీరా హత్యకేసు లాయర్!

వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ   జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కావడం లేదు. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు హాజరైంది లేదు. కాగా  ఇప్పుడు ఈ కేసులో ఇదే విషయాన్ని హైలెట్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ తరపున ఇన్నాళ్లు ఈ కేసులో వాదనలు వినిపించిన సలీం అనే లాయర్ తప్పుకోగా.. ఆ స్థానంలో పిచ్చుకుల శ్రీనివాసరావు అనే లాయర్ తాజాగా వాదనలు వినిపించారు. జగన్ ఎందుకు కోర్టుకు రావడం లేదనే అంశంపై లాయర్ శ్రీనివాసరావు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం ఇవ్వటానికి కోర్టుకు రావాలంటూ లాయర్ శ్రీనివాసరావు చేసిన డిమాండ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోడి కత్తితో దాడి చేశాడు.  అప్రమత్తమైన   వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది.

అప్పట్లో కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందో ఆ ఆసుపత్రి వైద్యులకే తెలుసు కానీ.. దాని వలన జగన్ పొందిన లబ్ది ఎంతన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ దాడిని కూడా జగన్ తనకు సానుభూతి దక్కేలా మలచుకున్నారు. చిన్నదో పెద్దదో దాడి అయితే జరిగింది కదా. ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది అనవసరం. అసలే ఎన్నికల సమయం. జరిగిన దానిని తనకు ఎంత అనుకూలంగా మలచుకుంటే అంత బెనిఫిట్. అందుకే చిన్న గాయానికి ఆసుపత్రిలో మూడు వారాల రెస్ట్ అవసరం అయింది. ఆ తర్వాత ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు. శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉన్నాడు.  

పలు మార్లు  బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వేసినా ఫలితం దక్కలేదు.  వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్ఐఏ కావడంతో.. బాధితుడి వాంగ్మూలం లేకుండా బెయిలు ఇచ్చే అవకాశం లేదని కోర్టులు అశక్తత వ్యక్తం చేస్తున్నాయి. ఇటు కేసు తేలక.. బెయిల్ రాక నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. కాగా ఇప్పుడు ఈ కేసు విచారణకు రాగా శ్రీనివాస్ తరపున పిచ్చుకల శ్రీనివాసరావు అనే కొత్త లాయర్ వాదనలు వినిపించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో వాదనలు వినిపిస్తున్నది కూడా ఈయనే కాగా.. ఇప్పుడు కోడికత్తి శ్రీనివాస్ తరపున కూడా ఈయనే వాదనలు వినిపించడంతో ఈ కేసు కూడా ఆసక్తికరంగా మారింది.

నిందితుడి తరఫు న్యాయవాది పిచ్చుకల శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. కుమార్తె కోసం లండన్ కు వెళ్లిన సీఎం జగన్.. కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు రాలేరా? అని ప్రశ్నించారు. ఈ కేసులో వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు జగన్ కోర్టుకు రావాల్సిందేనన్న ఆయన.. రాకపోతే కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. జగన్ తరపు న్యాయవాది వాదిస్తూ.. సీఎం బిజీగా ఉన్నారని.. అడ్వొకేట్ కమిషన్ ఏర్పాటు చేయాలనీ కోరారు.  దీనికి కూడా శ్రీనివాస్ న్యాయవాది గట్టి వాదనలు వినిపించారు. సాక్షి వద్దకే అడ్వొకేట్ కమిషన్, నిందితుడు వెళ్లాలనటం మొత్తం న్యాయ విధానాన్నే మార్చినట్లు అవుతుందని వాదించారు. ఫైనల్ గా కేసు అక్టోబరు 13కు వాయిదా పడింది. మరి తదుపరి ఈ కేసు ఎలా నడుస్తుందో చూడాలి.