కోర్టుకు జగన్ షెడ్యూల్.. ధిక్కారమా? అహంకారమా?
posted on Nov 20, 2025 8:37AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గురువారం (డిసెంబర్ 20) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన ఆరేళ్ల తరువాత కోర్టు మెట్టెక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా జగన్ కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. అయితే ఈ సారి మాత్రం అలా కుదరలేదు. ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ కు సీబీఐ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కోర్టు ఆయన పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో అనివార్యంగా జగన్ కోర్టుకు హాజరు కాక తప్పడం లేదు.
నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యేందకు జగన్ గురువారం (నవంబర్ 20) ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు హాజరై.. కోర్టు విచారణ ముగిసిన తరువాత లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, ఆ తరువాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెడతారు.
ఇలా ఉండగా జగన్ కోర్టుకు ఎన్నిగంటలకు వచ్చి ఎన్ని గంటలకు తిరిగి వెళ్లాలన్న విషయాన్ని తనకు తాను స్వయంగా నిర్ణయించుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అక్రమాస్తుల కేసులో నిందితుడై ఉండీ, 18 నెలలు జైలు జీవితం గడిపి గత పుష్కరకాలంపైగా బెయిలుపై ఉండి కూడా గత ఆరేళ్లుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని జగన్ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడ్డానికి వస్తూ కోర్టుకే సమయం ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
వీటన్నిటికీ మించి ఈ రోజు నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తులకు సంబంధించి దాదాపు 31 కేసులకు సంబంధించి విచారణ జరగనుంది. ఇన్ని కేసుల విచారణకు జగన్ ఇచ్చిన గంట సమయం సరిపోతుందా? జగన్ తనంతట తాను నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే కోర్టులో విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
నిందితుడిగా ఉన్న జగన్ ఒక గంట పాటు మాత్రమే కోర్టులో ఉంటాను అంటూ న్యాయస్థానానికి సమయం ఇవ్వడం ఏమిటని న్యాయనిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో తాను ఎంత సమయం ఉంటాను అన్నది ఒక నిందితుడు తనంతట తాను స్వయంగా ఎలా నిర్ణయించుకుంటాడు? ఇలా తాను గంట సేపు మాత్రమే ఉంటానంటూ జగన్ న్యాయస్థానానికే షెడ్యూల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను ధిక్కరించడం, చులకన చేయడమే అవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. జగన్ వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.