అమరావతే ఏపీ రాజధాని డిసెంబర్ లోనే గెజిట్?!
posted on Nov 19, 2025 3:01PM

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజథాని అమరావతిపై కుట్రల నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి రైతులు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక గెజిట్ ను డిమాండ్ చేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఇటీవలఅ రైతులతో సమావేశమైన సందర్భంగా ఈ విషయంపై రైతుల నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. అమరావతి గెజిట్ కు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఆర్డీయే కమిషనర్ ఈ బిల్లుకు అవసరమైన విధివిధానాలపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే శీతాకాల సమావేశాలలోనే అంటే డిసెంబర్ లోనే అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ చట్టపరమైన రక్షణ కలిగేలా గెజిట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలన్న రైతుల డిమాండ్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. తెలుగుదేశం ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ఈ మేరకు అమరాతి గెజిట్ విడుదల చేయించే విషయంలో ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేదని అంటున్నారు.