జగన్ అడ్డా పై ఆందోళన.. పులివెందులలో పరువు గల్లంతేనా?

పులివెందల..ఆ పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు వైఎస్ కుటుంబం.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ.. అంటే 1978 నుంచి ఇప్పటివరకు పులివెందుల లో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే అన్నట్లుగా వైఎస్ హవా సాగింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ హావా కొనసాగిస్తూ  వచ్చారు. ఇప్పటి వరకూ పులివెందుల అంటే వైఎస్, ఆయన కుమారుడి జగన్ అడ్డాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా? అంటే వైసీపీ నేతలే ఔనని అంటున్నారు. త్వరలో జరగనున్న పులివెందుల జడ్పీటీసీ  ఉప  ఎన్నికలో విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ పోటీలో నిలబడటమే కాకుండా ,  గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుడడంతో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల నుంచి,  పార్టీ శ్రేణుల వరకు పులివెందులలో పరువు గల్లంతౌతుందా అన్న భయం వ్యక్తం చేస్తున్నారు.  అసలు పులివెందులలో ఎన్నికలంటే విజయం వైఎస్ కుటుంబానిదే అన్నట్లుగా అంతా భావించేవారు. ప్రత్యర్థులు కూడా అక్కడ పరాజయాన్ని ఎన్నికకు ముందే అంగీకరించేసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప పోరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? వైసీపీ అంటే జగన్ పట్టు నిలుపుకుంటారా? అన్న అనుమానాలు వైసీపీలోనే వ్యక్తం అవుతోంది.  

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దింపింది.  బీటెక్ రవి ఎమ్మెల్సీగా, మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో  దిట్టగా గుర్తింపు పొందారు.  ఆయన సతీమణి  లతారెడ్డి టిడిపి అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  పులివెందుల జెడ్పీటీసీని దక్కించుకోవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది.  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పులివెందుల ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో  వైసిపి అత్యధిక స్థానాలను గెలిపించుకుంది. దీంతో ఇప్పుడు పులివెందులలో జగన్ కు పరాభవం కలిగేలా చేసి సత్తా చాటాలని తెలుగుదేశం పట్టుదలతో ఉంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను టీడీపీ అవకాశంగా భావిస్తోంది.  దీంతో తెలుగుదేశం నేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా   ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి కుటుంబాన్ని కలుస్తూ,  విజయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  తెలుగుదేశం దూకుడుతో వైసీపీ బెంబేలెత్తిపోతున్నది.  

పులివెందుల ఉప ఎన్నికల్లో జడ్పిటిసి స్థానాన్ని కైవసం  కైవసం చేసుకోవడమే టార్గెట్ గా  పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు  దిశా నిర్దేశం చేయడంతో పాటు జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ని ఈ ఎన్నికల్లో సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.  దీంతో ఆదినారాయణరెడ్డి   గత కొన్ని రోజులుగా  పులివెందులలో  మకాం వేసి, స్థానిక నాయకులు, అన్ని పంచాయతీలోని  నాయకులతో చర్చలు జరుపుతూ తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం కసరత్తు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి పులివెందుల లో బంధుత్వాలు ఉండడం, పక్క నియోజకవర్గమే కావడంతో పులివెందుల మండలంలో జరిగే ఉప ఎన్నికల్లో వాటన్నిటిని సమీకరించి  తెలుగుదేశం అభ్యర్థి  లతారెడ్డిని గెలిపించే వ్యూహంతో ఉన్నారు. ఇందుకు తోడు బీటెక్ రవికి పులివెందుల మండలంలో ఉన్న పట్టు తోడౌతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  

అలాగే   పులివెందుల నియోజకవర్గం నుంచి రాయలసీమ పట్టభధ్రుల స్థలానికి పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించిన  భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి  కేడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తున్నారు.  అంటే కడప జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం సమష్టిగా పని చేస్తున్నారు.  వైసీపీ విజయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   

వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మండలం అయిన పులివెందులలో ఈ పరిస్థితి తలెత్తడం వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నది. దానికి తోడు జగన్ కు తల్లి విజయమ్మ, చెల్లలు షర్మిల దూరం కావడంతో వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక వచ్చిన పరిస్థితి. ఈ తరుణంలో పులివెందుల జడ్పీటీసీ ఉప పోరులో వైసీపీ అభ్యర్థి విజయం అంత సులువు కాదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది.   వైసీపీ నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో  పులివెందుల జడ్పీటీసీగా విజయం సాధించిన  మహేశ్వర్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందడంతో  ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత మహేశ్వర్ రెడ్డి తనయుడు తుమ్మల హేమంత్ రెడ్డి ని  అభ్యర్థిగా బరిలో  దిగారు .కడప ఎంపీ అవినాష్ రెడ్డి  హేమంత్ రెడ్డి విజయం కోసం పని చేస్తున్నారు. అయితే  పులివెందులలో గతంలో ఉన్న పరిస్థితులు లేకపోవడం, అప్పుడు ఉన్నంతమంది నాయకులు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం వైసీపీకి ఇబ్బందిగా మారాయి.  ఈ పరిస్థితుల్లో  పులివెందులలో జగన్ కు, వైసీపీకీ పరాభవం తప్పదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu