జగన్ జనంలోకి.. మళ్లీ వాయిదా.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడిందా? జనం  మూడ్ అవగతమైందా? అందుకే జనంలోకి రావాలన్న తన కార్యక్రమాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారా? అంటే పరిశీలకులు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు సైతం ఔననే అంటున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో జనంలోకి వెడితే ఆబోరు దక్కదన్న విషయం అర్ధమవ్వడంతోనే జగన్ తన జిల్లాల పర్యటనలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత జగన్ చాలా వరకూ బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అడపాదడపా చుట్టపు చూపుగా మాత్రమే రాష్ట్రానికి వచ్చి పరామర్శ యాత్రల పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే జగన్ జనంలోకి వస్తున్నానంటూ ప్రకటించిన రెండు మూడు ముహూర్తాలూ వాయిదా పడ్డాయి. తాజాగా వచ్చే ఏడాది వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటి నుంచీ తాను ఇక జనంలోనే ఉంటానని ప్రకటించేశారు. అయితే ఆ ప్రోగ్రాం కూడా వాయిదాపడిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఈ వాయిదా గురించి వైసీపీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోయినప్పటికీ.. జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు ఆఫ్ ది రికార్డ్ అంటూ.. జగన్ వచ్చే ఏడాది కూడా జనంలోకి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. 

అధకార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ఇసుమంతైనా వ్యతిరేకత కానరావడం లేదనీ, పైపెచ్చు జగన్ పరామర్శ యాత్రలకు జనం నుంచి స్పందన కరవవ్వడం, ఆ యాత్రలకు జనసమీకరణ సైతం కష్టంగా మారడంతో జగన్ తన జనంలోకి కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ప్రజలలో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత లేని సమయంలో జనంలోకి వచ్చి సర్కార్ పై విమర్శలు చేయడం వల్ల ఈ మాత్రంగా ఉన్న పరపతి కూడా పలుచన అవుతుందన్న ఉద్దేశంతోనే జగన్ జనంలోకి కార్యక్రమాన్ని చేపట్టడం లేదని అంటున్నారు. అయితే ఆయన జనంలోకి కచ్చితంగా వస్తారనీ, అయితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన తరువాత ఆ కార్యక్రమం ఉంటుందనీ చెబుతున్నారు.