జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్.. మరో 18 మంది వైసీపీ నేతలపై కేసులు?
posted on Aug 2, 2025 2:19PM

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన ఎఫెక్ట్ తో వైసీపీ నాయకులపై కేసులు నమోదౌతున్నాయి. జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరు అంబేద్కర్ భవన్ పక్కన జరిగిన తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్యకు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ పై నెల్లూరు దర్గా మిట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి ముగ్గురితో పాటు ఈ తొక్కిసలాటకు కారకులుగా మరో 18 మందిని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
బారికేడ్లను తోసి వేయడం.. సెక్షన్ 30 యాక్ట్ ను ఉల్లంఘించడంతోపాటు హెడ్ కానిస్టేబుల్ గాయపడడానికి కారణమైన ఈ18 మందిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు గుర్తించిన ఈ 18 మందీ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన వారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో వీరిని అదుపులోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారని సుమారు నాలుగు కేసులు వరకు నమోదైన సంగతి తెలిసిందే.