జూబ్లీ ఉప ఎన్నికల బరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం?
posted on Aug 2, 2025 2:07PM
.webp)
భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ, నియోజక వర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. జూన్ 6 న మాగంటి మరణించిన నేపధ్యంలో.. ఆరు నెలల లోగా అంటే డిసెంబర్ లోగా జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక నిర్వహించ వలసి ఉంటుంది.అయితే.. ఇంకా ఎలక్షన్ కమిషన్,నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రధాన పార్టలు ఏవీ అభ్యర్ధులను ప్రకటించలేదు. అయినా.. జూబ్లీ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ఎగసి పడుతోంది.
ఈ నేపధ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా జూబ్లీ సీటును తమ ఖాతాలో కలుపుకోవాలని, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్ధులను ప్రకటించక పోయినా.. పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీల టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఓ వంక టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే, మరోవంక టిక్కెట్ ఖాయంగా వస్తుందన్న విశ్వాసంతో నియోజక వర్గంలో కార్యకర్తలు, అనుచరుల సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు.
అదలా ఉంటే సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఇప్పటికే కకంటోన్మెంట్ ఉప ఎన్నికలలో గెలిచిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ సీటును కైవసం చేసుకుని.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు, స్ట్రాంగ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని చూస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కిషన్ రెడ్డి ఇప్పటికే నియోజక వర్గంలో కేంద్ర మంత్రి హోదాలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తున్నారు.
మరోవంక ప్రధాన పార్టీలు మూడింటిలోనూ.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిజానికి ఎంఐఎం ఆమోదంతో.. గతంలో పోటీ చేసిన మాజీ క్రికెటర్’ అజారుద్దీన్ పేరు ఆల్మోస్ట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఒక విధంగా ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే.. ఇప్పడు తలఫై ఫిరాయింపుల కత్తి వేళ్ళాడుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ టికెట్ కోసం క్యూలో నిలబడినట్లు తెలుస్తోంది. అయితే.. దానం నాగేందర్ మాత్రం తాను టికెట్ కోరలేదని.. కానీ తనకు టికెట్ ఇస్తే.. జూబ్లీతో పాటుగా ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నియోజక వర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని అంటున్నారు. మరోవంక జూబ్లీలో ఎవరు గెలిస్తే వారు మినిస్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ టికెట్ కోసం పోటీ ఎక్కవగా ఉందని అంటున్నారు.
అదలా ఉంటే కొద్ది రోజుల క్రితం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్న ప్రభాకర్, జూబ్లీ టికెట్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ టికెట్ స్థానికంగా పనిచేసే వారికే కానీ.. నాన్ లోకల్ అంటే స్థానికేతరులకు ఇచ్చేది లేదని స్పష్తం చేశారు. అలాగే.. ఎంఐఎం, కాంగ్రెస్ టికెట్ ముస్లిం మైనారిటీకి ఇస్తేనే.. తమ మద్దతు ఉంటుందని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం షరతు విధించిన తర్వాతనే.. కాంగ్రెస్ నాయకత్వం అజారుద్దీన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజక వర్గంలో ఒక లక్షా 30 వేల వరకు ఉన్న ముస్లిం ఓట్లు అత్యంత కీలకం అయిన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పత్వాను కాదన లేదని అంటున్నారు.
అయితే.. దానం పైకి ఏమి చెప్పినా, ప్రస్తుత రాజకీయ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆయన ఢిల్లీ స్థాయిలోనూ పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. అటు ఖైరాబాద్’ స్థానానికి రాజీనామా చేసి ఫిరాయింపుల కేసు నుంచి బయట పడడంతో పాటుగా.. జూబ్లీలో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా సిటీ ఖాతాలో మంత్రి పదవిని సొంతం చేసుకోవచ్చని దానం పెద్ద స్కెచ్చే వేశారని అంటున్నారు. ప్రధానంగా సుప్రీం కోర్టు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలల్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించిన నేపథ్యంలో దానం అనర్హతవేటు నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. పార్టీ ఫిరాయించిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల విషయం ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోణీ కొట్టి ఫిరాయింపుల ఖాతా ఓపెన్ చేయడంతో పాటుగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ రాజీనామా చేసి, ఎంతో కొంత గౌరవ ప్రదంగా పక్కకుతప్పుకోవడం తప్ప మరో మార్గం లేదనీ.. అందుకే దానం నాగేందర్ జూబ్లీలో పోటీచేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే.. జూబ్లీ స్టోరీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. అంతిమంగా ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం అంటున్నారు విశ్లేషకులు.