జగన్ పట్టిన కుందేలుకి మూడే..!
posted on Sep 25, 2025 12:29PM
.webp)
జగన్ చిన్నపిల్లాడో లేక, తానొచ్చిన ఫ్యాక్షన్ కుటుంబమే అలాంటిదో తెలీదు కానీ.. , ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. అందుకు నిబంధనలు, పాటింపులేం ఉండక్కర్లేదు. ఏదైనా అంతే.. తిరుమల డిక్లరేసన్ నుంచి మొదలు పెడితే.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వరకూ సరిగ్గా ఇలాగే కనిపిస్తుంది జగన్ వ్యవహారశైలి. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. జగన్ కి ఆ హోదా ఇవ్వడానికి తనకు రూల్స్ బుక్ లో ఎలాంటి క్లాజు కనిపించడం లేదన్నారాయన. అయితే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఢిల్లీకి సంబంధించి ఒక ఉదాహరణ గుర్తు చేశారు. అప్పట్లో అంటే 2015 ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ క్లీన్ స్వీప్ చేసిందీ.. ఆ టైంలో బీజేపీకి వచ్చింది కేవలం మూడు సీట్లే.. కానీ ఢిల్లీ స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తాను ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించారన్న వార్త తెరపైకి తెచ్చారు.
ఇదిలా ఉంటే మరో వార్త ఏంటంటే.. తాము సభలోకి వస్తాము. కానీ మాట్లాడ్డానికి కావల్సినంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు జగన్ అని. రాకుండానే టైం ఇవ్వరన్న గ్యారంటీ ఏంటి? వస్తే కదా తెలిసేది? ఇదెలా ఉందంటే జగన్ టెన్త్ తప్పిన పిల్లలు ఆ కాసిన్ని మార్కులేసి మమ్మల్ని పాస్ చేసేయవచ్చు కదా? అని అడిగినట్టుందని అంటారు కొందరు. ఇంకా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే కొందరు చెప్పేదాన్నిబట్టి చూస్తే అసలు జగన్ కి ఉన్న ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయేలా ఉంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 190(4) ప్రకారం.. అరవై రోజుల పాటు వరుసగా ఎవరైనా సభ్యుడు రాకుంటే.. ఆ సీటు ఖాళీగా ప్రకటించవచ్చు.
ఇప్పుడు జగన్ కు ముందు గొయ్య- వెనక నుయ్యగా ఉందట పరిస్థితి. ఎంత మాత్రం ఆయన హ్యాపీగా లేరు. ఒక సమయంలో జగన్ తన ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసీ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగైనా తనకీ తలవంపులు తప్పుతాయన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మిగిలిన వారి చేత కూడా రిజైన్ చేయించి.. ఉప ఎన్నికలకు పోవాలన్నది జగన్ ఎత్తుగడ. మరి వారిలో అందరూ ఓడిపోతే పరిస్థితేంటన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఎందుకంటే అ చివరికి పులివెందులలో తన స్థానంలో పోటీ చేసే అవినాష్ కూడా ఓడిపోతే.. తర్వాత జగన్ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కాగలదన్న మాట వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.