ఏపీ లిక్కర్ స్కాం.. డిఫాల్ట్ బెయిలు రద్దు కోసం హైకోర్టుకు సిట్
posted on Sep 25, 2025 1:11PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించడమే కాకుండా, రాజకీయంగా కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న మద్యం కుంభకోణం కేసులో మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజురు చేయాడాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్‌లకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో గురువారం(సెప్టెంబర్ 25) వాడీ వేడి వాదనలు జరిగాయి.
సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా, నిందితుల తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. కాగా సిట్ తరఫున వాదించిన సిద్ధార్థ్ లూత్రా.. నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఆగస్టు 11నే తాము అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసి, అందులో ఈ నలుగురు నిందితుల పాత్రను స్పష్టంగా వివరించామని కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌లోని అభ్యంతరాలను సెప్టెంబర్ 1లోపే సరిదిద్దామని.. అయినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఆగస్టు 18న నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్ప రెగ్యులర్ బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు.. కేవలం రోజుల వ్యవధిలోనే అంటే.. సెప్టెంబర్ 5న డిఫాల్ట్ బెయిల్ ఎలా మంజూరు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందువల్ల నలుగురి బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని సిద్ధార్థ్ లూద్రా వాదించారు.
నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ.. రెగ్యులర్ బెయిల్ ఆదేశాలకు, డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పటి పరిస్థితులు, సాక్ష్యాధారాల ఆధారంగా రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత ఇచ్చే డిఫాల్ట్ బెయిల్‌పై దాని ప్రభావం ఉండదన్నారు. చట్టప్రకారం 90 రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, తమ వాదనలను లిఖితపూర్వకంగా శుక్రవారంలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.