నేడు భోగాపురంలో పర్యటించనున్న జగన్

 

రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరిస్తున్నప్పుడు రైతుల తరపున నిలబడి పోరాడుతానని గట్టిగా హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి కోసం మంగళగిరిలో ఓ రెండు రోజులు దీక్షలు చేసారు. ఆయన రాజధాని పనులకు అడుగడునా అడ్డుపడుతూనే ఉన్నారు. ఎందుకంటే రైతుల కోసమేనని చెప్పుకొన్నారు. పోనీ రైతులకయినా అండగా నిలబడ్డారా...అంటే అదీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా గుంజుకొన్నపటికీ తను ముఖ్యమంత్రి కాగానే ఎవరి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తానని రైతులకు హామీ ఇచ్చి తన దీక్ష ముగించారు. కానీ రైతుల నుండి ప్రభుత్వం సేకరించిన భూములపై రాజధాని నిర్మాణం జరిగిన తరువాత ఆయన ఆ భూములను రైతులకు ఏవిధంగా తిరిగి అప్పగిస్తారో చెప్పలేదు.

 

రాజధాని రైతులకు హ్యాండిచ్చిన జగన్ ఇప్పుడు భోగాపురం రైతుల తరపున పోరాడేందుకు బయలుదేరుతున్నారు. విజయనగరం జిల్లా, భోగాపురం గ్రామం వద్ద విమానాశ్రయం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రైతుల నుండి భూసమీకరణ చేస్తోంది. దానికి స్థానిక రైతుల నుండి వ్యతిరేకత ఎదురవుతుండటంతో వారికి అండగా నిలబడి పోరాడేందుకు జగన్ అక్కడ వాలిపోతున్నారు. అక్కడి రైతులను కలిసేందుకు ఈరోజు ఆయన భోగాపురంలో పర్యటించబోతున్నారు. వారితో మాట్లాడిన తరువాత తన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కోసం ఈనెల 7వ తేదీ నుండి గుంటూరులో ఆయన నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కనుక ఆ కార్యక్రమం ముగిసిన తరువాత భోగాపురం రైతుల కోసం దీక్ష చేస్తారేమో?