జగన్ ఢిల్లీ టూర్ వెనుక సీక్రెట్టేంటి?

 

వైసీపీ అధినేత జగన్ అర్జెంటుగా ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఇంత అర్జెంటుగా ఢిల్లీ టూర్ ఎందుకయ్యా అంటే, ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్రమోడీని కలిసి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిందిగా కోరబోతున్నానని చెబుతున్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన జగన్ రాత్రికి రాత్రే మారిపోయి ఇలా రాష్ట్రానికి పనికొచ్చే పని చేయబోతున్నాడేంటా అని కొంతమందికి సందేహం రావడం సహజం. మరికొంతమంది అమాయకులకైతే పోలవరం నిధుల కోసం ప్రధానిని కలుస్తున్న జగన్ సారు ఎంత మంచోడో అని అనిపిస్తుంది. అయితే జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు సీక్రెట్ వేరే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

జగన్ ఢిల్లీ వెళ్ళడం, ప్రధానిని కలవటం, పోలవరం కోసం నిధులు అడగటం... యాజ్‌టీజ్ ఇలాగే జరిగితే అది రొటీన్. జగన్ ఢిల్లీకి వెళ్ళడం, ప్రధానిని కలవటం, తాను జైల్లో పడకుండా సహకరిస్తే, ఏపీలో బీజేపీ బలపడటానికి ఏం చేయాలో అది చేస్తానని నరేంద్రమోడీకి చెప్పి, ఒప్పించడం... ఇదీ జగన్ టూర్ వెనుక వున్న అసలు ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే జగన్ త్వరలో జైల్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నే మరికొన్ని వందల కోట్ల జగన్ సంబంధీకుల ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ‘బంపర్ ఆఫర్’ ఇవ్వడం ద్వారా తనకు మరోసారి జైలుయోగం పట్టకుండా చేసుకోవాలన్నది జగన్ ప్లాన్ అని పరిశీకులు చెబుతున్నారు.

 

బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో భాగస్వామిగా వుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎదగాలని భావిస్తోంది. అందుకే ఏపీలోని కొంతమంది బీజేపీ నాయకులు జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో జగన్‌ని ప్రేమగా లాలిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రానని మొండికేస్తే ఆయన్ని లాలించి, బుజ్జగించిన బీజేపీ నాయకులు ఆయన తిరిగి అసెంబ్లీకి వచ్చేలా చేశారు. స్పీకర్ మీద జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేసి, స్పీకర్‌కి సారీ చెప్పించిన బృహత్కార్యం వెనుక వున్నది బీజేపీ ఎమ్మెల్యేలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా దినదిన ప్రవర్ధమానమైన వైసీపీ - బీజేపీ దోస్తీ ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసే ప్రయత్నం చేయడం వరకూ వెళ్ళింది. ఈ కలయిక కోసం పోలవరం ప్రాజెక్టుని ఉపయోగించుకుంటున్న జగన్ తెలివితేటలకి హేట్సాఫ్. మరి వైసీపీ, బీజేపీల మధ్య ఈ ఇన్‌స్టెంట్ స్నేహం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో, ఈ స్నేహం కారణంగా ఏపీ రాజకీయాల్లో మరెన్ని వింతలు చూస్తామో...