రాహుల్ బాబు వచ్చేస్తున్నాడు కాసుకోండి

 

రాజకీయాలలో ఉన్నవాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే ఆత్మహత్యతో సమానంగా భావిస్తారు. అందుకే వారు నిత్యం ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని మీడియాముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ జనాలు తమని మరిచిపోకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ దేశానికి ప్రధానమంత్రి అవుదామనుకొన్న రాహుల్ గాంధీ, కనీసం తన స్వంత పార్టీ మీద కూడా పట్టు సాధించలేకపోవడంతో, పార్టీ మీద అలిగి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన ఈవిధంగా మాయమయిపోవడంతో మీడియా ప్రశ్నలకు, ప్రతిపక్షాల వెక్కిరింతలకు సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు. కానీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం ఇంతకాలంగా మీడియాను తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ శనివారంనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూరే దేవ్ బధే గ్రామానికి వెళ్లినప్పుడు ఆమె కూడా మీడియాకు దొరికిపోయారు.

 

ఆమెను చూడగానే మీడియావాళ్ళు అందరూ అడిగిన మొట్ట మొదటి ప్రశ్న ‘రాహుల్ గాంధీ ఎప్పుడు తిరిగివస్తారనే.’ కానీ ఆమె కూడా వారికి ఫలానా తేదీన తిరిగి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. త్వరలోనే తిరిగివచ్చి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటాడని మాత్రమే చెప్పారు.

 

ఇంతకు ముందు ఆయన మరో రెండు, మూడు వారాలపాటు తన శలవు పొడిగించారని మీడియాలో వార్తలు వస్తే అప్పుడు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆ వార్తలను ఖండించారు. కానీ మూడు కాదు నాలుగు వారాలవుతున్నా ఆయన అయిపూ జాడా లేదు. కనీసం ఆమె కూడా తన కొడుకు అసలు ఈవిధంగా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలేకపోవడం చూస్తుంటే రాహుల్ గాంధీ అజ్ఞాతంలో వెళ్ళడానికి చాలా బలమయిన కారణాలే ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఎలాగూ రాహుల్ బాబు తిరిగి వచ్చేస్తున్నాడని రాజమాత ప్రకటించేశారు గనుక ఒకవేళ యువరాజవారు మళ్ళీ తన లీవ్ పొడిగించకుండా నిజంగా తిరిగి వచ్చేస్తే అప్పుడు ఆయన నోటితోనే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోవచ్చును.