ఇటు అలీ అటు పవన్ మధ్యలో...జగన్ ?

రాజకీయాలకు ఉండే ‘పవరే’ అలాంటిది..మంచి మిత్రులనే కాదు, భార్యా భర్తలను, తండ్రీ కొడుకులను, ఆన్పదమ్ములను,అక్క చెల్లెళ్ళను, వారినీ వీరిని అని ఏముంది, చివరకు అవిభక్త కవలలను సైతం  విడదీయగల మహమ్మారి రాజకీయం. సినిమా ఇండస్ట్రీతో ఏ కొంచెం పరిచయం ఉన్న ఎవరికైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. అలీ పవన్ ప్రాణమిత్రులు, జిగ్నీ దోస్తులు అన్నా కొలత సరిపోదు. బియాండ్ దట్ అంతకంటే ఎక్కువైనది ఆ ఇద్దరి స్నేహం అంటారు, సినిమా రంగంలోని ఆ ఇద్దరి మిత్రుల మిత్రులు. ‘తొలి ప్రేమ’ మొదలు ‘కాటం రాయుడు’ వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలోనూ స్టోరీ డిమాండ్ చేసినా చేయక పోయినా, ‘అలీ’ కి ఓ పాత్ర ఉంటుంది. అదొక, ‘రాజ్యాంగ’ నిబంధన. అందుకే, కథకు అవసరం ఉన్నా లేకున్నా, అలీ కోసం ఓ పాత్రను సృష్టించిన దర్శకులు ఉన్నారు. ఇక్కడ అప్రస్తుతమేమో కానీ, అలాంటి జోడీ ఇంకొకటి కూడా వుంది. దర్శకుడు తివిక్రం శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ, హాస్య నటుడు సునీల్ కు ఒక పాత్ర ఉటుంది. అది కష్టాల్లో ఒకే గదిలో కలిసున్న స్నేహానికి చిహ్నం అంటారు.   

కట్ చేస్తే ... ఈ మధ్య కమెడియన్ ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం జరిగింది. ఆ వివాహానికి, మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరయ్యారు. నాగార్జున, అమల జంట వచ్చి అక్షింతలు వేశారు. ఇంకా చాలా మంది సినిమా పెద్దలు, చిన్నలు చాలా మంది పెళ్ళికి వెళ్లి అలీతో సరదాగా, సందడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ జంటగా కాదు కదా కనీసం ఒంటరిగా అయినా పెళ్ళికి వెళ్ళలేదు. అదేమిటి, అంత జిగ్నీ దోస్త్ కూతురు పెళ్ళికి పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్ళలేదు?ఈ ప్రశ్న పెళ్ళికి వెళ్ళిన వారినే కాదు, వెళ్లని వారినీ వెంటాడుతూనే వుంది. సోషల్ మీడియాలో అయితే అందుకే వెళ్ళలేదంటూ ఎన్నో కథలు. ఆ ఇద్దరి మధ్య రాజకీయమే చిచ్చు పెట్టిందని, చాలా చాలా కథలు షికార్లు చేస్తున్నాయి.ఒకరు, అసలు అలీ పిలవనే లేదంటే, ఇంకొందరు, అలీ పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్లలేదని అంటారు. ఏది నిజమో, ఏది రాజకీయమో... ఎవరికీ తెలియక పోవచ్చును. 

అయితే,అలీ కొంచెం చాలా నింపాదిగా,పవన్ కళ్యాణ్ రాకపోవడానికి, అందరు అనుకుంటున్నట్లుగా  రాజకీయ విభేదాలు కారణం కాదు అని ఒక వివరణ ఇచ్చారు. చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవ్వడం వలన చేతనే పవన్ కళ్యాణ్ పెళ్లికి హాజరు కాలేకపోయారని, అలీ వివరణ ఇచ్చారు. అలాగే,  ఎప్పుడైనా కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటే చెప్పు.. అప్పుడు వస్తాను అని అన్నారనీ, అన్నారు. అయితే, అయన ఇచ్చిన వివరణ నమ్మేటట్టు లేదని సోషల్ మీడియాలో కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. 

సరే, పెళ్లికి రావడానికి ఫ్లైట్ మిస్ కథ చెప్పారు బాగుది. పోనీ అదే నిజం అనుకున్నా, పెళ్లి తర్వాత గుంటూరులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా.. ఆ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా.. చాలా మంది రాజకీయ ప్రముఖులు హజరయ్యారు,కదా .. మరి రిసెప్షన్ కు అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు?  అంటూ లా పాయింట్స్ లాగే వాళ్ళు లాగుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో, పవన్ కళ్యాణ్ ఎందుకని ఆలీ ఆయన్ని పెళ్ళికి మాత్రమే పిలిచి రిసెప్షన్కు పిలవ లేదా? ముఖ్యమంత్రి పాల్గొనే వేడుకలో తాను పాల్గొనడం ఎందుకని, పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? అంటూ కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఆలీ, ఎప్పుడో తీరిగ్గా సమాధానం ఇస్తే, ఇవ్వవచ్చును. ఇవ్వక పోతే ఇవ్వక పోనూవచ్చును. ఇచ్చిన ఐవ్వక పోయిన భేతాళ ప్రశ్న మాత్రం ఎప్పటికీ చెరిగి పోదు. చెట్టెక్కదు.

అయితే  అలీ ఇంట పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళ లేదనే చర్చకు చుక్కపెట్టి, అయన చెప్పిందే నిజం అని అనుకున్నా,రాజకీయాలు స్నేహ సంబంధాలనే కాదు,రక్త సంబంధాలను రక్తసిక్తం చేస్తాయి అనేది, నిజం.  అందులోను జగన్ రెడ్డితో వ్యవహారం అంటే ఇక వేరే చెప్పనక్కరలేదు.జగన్ రెడ్డి సొంత బాబాయ్  వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏమి జరుగుతోందో చూస్తున్నాం.  వివేకానంద రెడ్డి కుమార్తె, ఇతర బంధువులు జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల విశ్వాసం లేక కేసు విచారణను, పొరుగు రాష్ట్రానికి బదిలీచేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఈ మధ్యనే  తీర్పు నిచ్చింది. 

ఇక ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన సొంత సోదరి  వైఎస్ షర్మిల విషయంలో ఏమి జరుగుతోందో కూడా చూస్తూనే ఉన్నాం.పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి, వేధింపులకు గురిచేస్తున్నా, జగన్ రెడ్డిలో చలనం లేదు. చెల్లినే కాదు, తల్లినీ తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి కాలు కదల కుండా కట్టిపడేసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. సో .. ఆలీ చెప్పినా చెప్పక పొయినా, పవన్ – అలీ మధ్య అడ్డుగోడగా నిలిచింది ఎవరో కాదు.రాజకీయమే. అందుకే ..రాక్షసీ నీ పేరు రాజకీయమా ? అన్నారు, హాస్య రచయిత ఆదివిష్ణు. అవును అని చూపించారు హాస్య నటుడు అలీ .. అదీ విషయం.