వరంగల్ టీఆర్ఎస్ లో రోడ్డుకెక్కిన వర్గ విభేదాలు

వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గు మన్నాయి. ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ బాస్కర్ దిష్టి బొమ్మ దగ్ధం వరకూ పరిస్థితి దిగజారింది. పార్టీ ఘనంగా జరుపుకుంటున్న దీక్షా దివస్ ఉత్సవాలలో విభేదాలు భగ్గు మనడంలో తెరాసలో ఐక్యత మేడి పండు చందమేనని బయటపడిపోయింది. విషయం ఏమిటంటే..దీక్షా దివస్ సందర్భంగా    తెరాస వరంగల్ లో చేపట్టిన 11 రోజుల ఉత్సవాలు మూడో రోజునే  రోజే రసాభాసగా మారాయి.

దిక్షా దివస్ సందర్భంగా గత నెల 29 నుంచి 11 రోజుల పాటు కార్యక్రమాలను షెడ్యూల్ చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 29న కాళోజీ సెంటర్​ లో దీక్ష దివస్ ప్రారంభించారు, 30న  జయశంకర్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక డిసెంబర్ 1న బైక్ ర్యాలీ నిర్వహించారు.  శుక్రవారం (డిసెంబర్ 2)న వరంగల్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తెరాసలో విభేదాలు భగ్గు మన్నాయి. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి గళం బలంగా లేచింది. ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్లిన మెహరున్నీసా ఫొటోకు  ఆ ఎగ్జిబిషన్ లో  స్థానం కల్పించకపోవడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం రసాభాసగా మారింది.

దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ఫొటోలను చింపేసి మొహరున్నీసా ఆందోళనకు దిగారు. నిజమైన ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వకుండా దిక్షాదివస్ నిర్వహించడమేమిటంటూ దాస్యం వినయ్ భాస్కర్ ను నిలదీశారు. ఒక దశలో వినయ్ భాస్కర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కూడా దిగారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడినట్లైంది. తెరాస ముందస్తు ప్రణాళికలు జోరుగా రచిస్తున్న సమయంలో అత్యంత కీలకమైన వరంగల్ లో పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో టీఆర్ఎస్ వర్గాలలో ఆందోళన మొదలైంది. అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైన దిక్షా దివస్ ఉత్సవాల మూడో రోజుకే ఇలా విభేదాలు రచ్చకెక్కి కార్యక్రమం  రచ్చరచ్చగా మారడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ అధినాయకత్వం పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’ చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా విభేదాల కారణంగా తెరాస ప్రతిష్ట మసకబారుతోందని పరిశీలకులు అంటున్నారు.

అసలే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో డిఫెన్స్ లో పడిన తెరాస ఇప్పుడు కీలకమైన వరంగల్ జిల్లాలో రచ్చకెక్కిన విభేదాలతో  కొత్త తలనొప్పి మొదలైనట్లేనని అంటున్నారు. ఉద్యమ కారులకు తెరాసలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమ కారులు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి వైదొలుగుతుండటానికి కారణం వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవడమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.

దానికి తోడు ఉద్యమ సమయంలో సమైక్య వాదులుగా ముద్ర పడిన పలువురు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉండటాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన వారికి ఇసుమంతైనా గుర్తింపు లేకుండా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ విషయంలో మొహరున్నీసా నిరసన గళమెత్తి వినయ్ బాస్కర్ పై విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా ఉద్యమ కారుల ఫొటో ఎగ్జిబిషన్ లో ఉన్న కొన్ని ఫొటోలను చింపేసి ఆందోళనకు దిగడం పార్టీకి ఒకింత ఇబ్బంది కరమేనని చెప్పక తప్పదు.  ఎన్నికల వేళ రచ్చకెక్కతున్న విభేదాలు పార్టీ నాయకత్వంలో ఆందోళనకు కారణమౌతున్నాయి.