జనం మనతోనే ఉన్నారు.. మీరే జనంతో లేరు.. పశ్చిమ నేతలకు బాబు క్లాస్

చంద్రబాబు ‘పశ్చిమ’ పర్యటన తెలుగు దేశం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు ఇవేవీ కూడా జనంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణను ఇసుమంతైనా తగ్గించ లేకపోయాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో ఆయోమయంలో ఉన్న శ్రేణులలో చంద్రబాబు పర్యటన జరిగిన తీరు ధీమా నింపింది. ఇక మీదట కూడా పార్టీ స్థానిక నాయకత్వం ఇదే ధోరణిలో ఉంటే నిలదీసే దన్ను దమ్మూ ఇచ్చింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా పార్టీ నేతలతో భేటీలో చెప్పారు. జనం మనతోనే ఉన్నారు.. కానీ మీరే జనంతో లేరు. ఇకనైనా తీరు మార్చుకోండి అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

ఇక బాబు చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటన తెలుగుదేశం పార్టీకి జవసత్వాలను నింపిందనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గోవవరి జిల్లాలలో పర్యటించిన నియోజకవర్గాలలో పార్టీ ఇన్ చార్జీలు లేరు.. ఆయా నియోజకవర్గాలలో నాయకుల మధ్య సమన్వయమూ అంతంత మాత్రమే. అయినా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటనకు జనం వరద గోదావరిలా పోటేత్తారు. ఆంక్షణ కరకట్టలను తెంచేసి మరీ ముందుకు దూకారు.

వెళ్లిన రెండు పెద్ద నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలు లేరు. ఉన్న నాయకుల మధ్య సమన్వయలోపం. అయినా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు చంద్ర బాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన  తెలుగుదేశం కూడా ఊహించనంతగా విజయవంతం అయ్యింది. బాబు కోసం జనం ఉరకలెత్తి పోటెత్తి రావడం    తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది.  నేతల మధ్య సమన్వలోపంతో ఒకింత అసంతృప్తితో ఉన్న క్యాడర్ కు చంద్రబాబు పర్యటన వెయ్యేనుగుల బలాన్నిచ్చింది.  అదే సమయంలో టీడీపీ వస్తే ఇప్పటి పథకాలు నిలిచిపోతాయన్న అధికార వైసీపీ ప్రచారానికి తిప్పి కొడుతూ చంద్రబాబు స్పష్టత ఇవ్వడం సంక్షేమాన్ని కొనసాగిస్తూనే సంపద సృష్ఠించి అభివృద్ధి చేస్తానని చెప్పడం తెలుగుదేశం నేతలలోనూ స్థైర్యాన్ని నింపింది.  

‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన   పర్యటన తెలుగే దేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాదు.. జనంలోనూ తమ బతుకులు బాగుపడతాయన్న స్థైర్యాన్నిచ్చింది. బాబు పర్యటన లో తీవ్ర జాప్యం జరిగినా జనం ఆయన కోసం గంటల తరబడి వేచి చూడటం ఎన్టీఆర్ ప్రభంజనం నాటి రోజులను గుర్తు చేసిందని పరిశీలకులు చెబుతున్నారు.  దెందులూరు, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నిడదలవోలు, తాడేపల్లిగూడెం, నూజివీడు నియోజకవర్గాల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి  పర్యటనలో జనం పోటెత్తారు. కీలకమైన నియోజకవర్గాలయిన చింతలపూడి, కొవ్వూరు నియోకవర్గాలకు ఇన్చార్జిల సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ, బాబు సభలు-రోడ్‌షోలకు మాత్రం అనూహ్యమైన స్పందన లభించడం పరిశీలకులను సైతం విస్మయ పరిచింది.

నిజానికి ఆ రెండు నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పరిస్థితి సరిగా లేదు. నాయకుల మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనక వస్తున్నా నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జనసమీకరణ ప్రయత్నాలే జరగలేదు.  అయితే  ఎవరూ బాధ్యత తీసుకోకపోయినప్పటికీ, ఆ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలకు జనం వరదగోదారిలా పోటెత్తారు. స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే పార్టీ నేతలతో సమావేశంలో చంద్రబాబు   జనం మనతోనే ఉన్నారు,  కానీ మీరు మాత్రం వాళ్ల మధ్యలో ఉండి పనిచేయడం లేదు. మీకు బాధ్యత లేదు. జనం మన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు.  కానీ మీరు దానిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. ఇకపై మీరంతా జనంలోనే ఉండండి. మీరెవరూ జనసమీకరణ బాధ్యత తీసుకోకపోయినా, అన్ని వేల మంది వచ్చారంటే మీ వైఫల్యం గురించి ఆలోచించండి’ అని క్లాసు  పీకారు.  

వాసాలపాడు క్రాస్‌రోడ్స్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ నేతల సమావేశం, గోపాలపురంలో దొండపూడి, పోలవరంలో జరిగిన చంద్రబాబు రోడ్‌షో, సభలకు జనం పోటెత్తారు. రోడ్లన్నీఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి.  వాస్తవానికి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ కన్నా నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగింది. అయినా  జనం  ఆయన కోసం వేచిచూడటం కనిపించింది.