జగన్ తీరుతో వైసీపీలో కలవరం

 

వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడం వైసీపీలో కలవరం రేపింది. ఇప్పటికే ఏపీలో అడ్డంగా ఆరిపోయి వున్న తమ పార్టీకి మరింత నష్టం కలిగించే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం వుందని పార్టీ నాయకులు పలువురు భావిస్తున్నారు. రోజురోజుకూ కొడిగడుతున్న వైసీపీ దీపాన్ని కొండెక్కకుండా ఆపడానికి  తాము తాపత్రయ పడుతుంటే, తమ నాయకుడు మాత్రం కొండెక్కుతున్న దీపాన్ని ఉఫ్ఫుమని ఆపేవిధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు నాయకులు బాధపడుతున్నారు. కేసీఆర్‌ పార్టీకి  మద్దతు ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనన్న విషయం తెలిసి కూడా జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారన్న భావన ఏపీ ప్రజల్లో వుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదాను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి జగన్ మద్దతు ఇవ్వడం కొరివితో తల గోక్కున్నట్టేనని వైసీపీ నాయకులు లబోదిబో అంటున్నారు. చంద్రబాబును అడ్డుకోవడానికే టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చానని జగన్ ఎంతగా కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేసినా అవి వర్కవుట్ అయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.  ఇంత జరిగాక తాము ఏముఖం పెట్టుకుని జనంలోకి వెళ్తామని వారు బాధపడుతున్నారు. జగన్ ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకునేముందు పార్టీలోని నలుగురితో చర్చిస్తే బావుండేదని వారు అంటున్నారు. ఇప్పుడు చేజారిపోయిన పరిస్థితిని మళ్ళీ ఎలా చక్కదిద్దాల్రా దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu