దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు.. పుష్ప నిర్మాతల నివాసాల్లోనూ!
posted on Jan 21, 2025 8:55AM

టాలీవుడ్ ను ఆదాయపప్ను శాఖ దాడులు కుదిపేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్మొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇటీవల విడుదలౌన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలూ భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా అంచనాలను అందుకోలేక చతికిల బడినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం భారీ కలెక్షన్లతో విడుదలైన రోజుల వ్యవధిలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలతో పాటు.. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన మరో సినిమా పుష్ప2 నిర్మాత నవీన్ ఎర్నేని, చెర్నీ నివాసాలు కార్యాలయాలలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దాదాపు 200 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దిల్‍రాజు, నవీన్ యెర్నేనీ, చెర్రీ నివాసాలు, కార్యాలయాలతో పాటు మరి కొన్ని చోట్ల కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటిందని మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం హిందీలోనూ ఆల్‍టైమ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 చిత్రాలను కూడా దాటేసింది. ఈ తరుణంలో పుష్ప 2 నిర్మాత నవీన్, ఆ ప్రొడక్షన్ హౌస్ సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అదే విధంగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి సందర్భంగా ఈనెలలోనే విడుదలయ్యాయి. ఈ రెండింటిలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో దిల్‍రాజు ఇంటిపై ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి.