రాజ్యాంగ దినోత్సవానికి కేసీఆర్ డుమ్మా.. గవర్నర్ తో విభేదాలే కారణమా?
posted on Nov 26, 2021 10:51AM
నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. పారాయి పాలన అంతమై.. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ నవంబరు 26కు 72 ఏళ్లు పూర్తవుతోంది. దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్.ఎమ్. సింఘ్వికి ఆలోచన వచ్చింది. అదే రోజును న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. అయితే, భారత ప్రభుత్వం 2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి, ఆ సంవత్సరం నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
రాజ్యాంగ దినోత్సవం రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రాజ్ భవన్ లో గవర్నర్ల అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 72వ రాజ్యాంగ దినోత్సత వేడుకను ప్రభుత్వం నిర్వహించింది. రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ పాల్గొన్నారు. కాని సీఎం కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజ్ భవన్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సీఎంవో నుంచి రాజ్ భవన్ వర్గాలకు ముందు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు కూడా చేశారు. కాని చివరి నిమిషంలో కేసీఆర్ రావడం లేదని రాజ్ భవన్ కు సీఎంవో సమాచారం ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి లేకుండానే గవర్నర్, చీఫ్ జస్టిస్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి కేసీఆర్ రాకపోవడంపై రాజ్ భవన్ తో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాజ్యాంగ దినోత్సవానికి సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదన్న దానిపై రకరకలా చర్చలు సాగుతున్నాయి.
.webp)
కొంత కాలంగా గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో నరసింహన్ గవర్నర్ కు ఉన్నప్పుడు తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. వారం వారం వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పండుగలు, ముఖ్యమైన రోజులు ఏమొచ్చినా రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ కు కేసీఆర్ విషెస్ చెప్పేవారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించేవారు. అయితే తమిళి సై గవర్నర్ గా వచ్చిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. రాజ్ భవన్ వైపే వెళ్లడం లేదు కేసీఆర్. పండుగల సమయంలోనూ ఆమెకు విషెస్ చెప్పడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. అంతేందుకు మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా బాపుఘాట్ లో గవర్నర్ తో కలిసి సీఎం నివాళి అర్పిస్తారు. కాని ఈసారి గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ తో విభేదాల కారణంగానే ఆయన గాంధీకి నివాళి అర్పించేందుకు వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
మరోవైపు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు సార్లు ప్రకటనలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్శిటీ వీసీల నియామకంలోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి.. కేసీఆర్ సర్కార్ వార్నింగ్ సిగ్నల్ పంపించిందనే చర్చ ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసినా.. గవర్నర్ తమిళి సై ఆమోదించ లేదు. రెండు నెలల పాటు ఆ పైల్ ను పెండింగులో పెట్టారు. అయినా గవర్నర్ ను వెళ్లి కలవలేదు కేసీఆర్. చివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. గవర్నర్ ను కలవడం ఇష్టం లేకే ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ ను ఆమెతో సమావేశం కాలేదని అంటారు.
తాజాగా రాజ్యాంగ దినోత్సవానికి హాజరుకాకపోవడంతో.. గవర్నర్ తో కలిసి వేదిక పంచుకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇదీ మంచి సంప్రదాయం కాదని, వ్యవస్థలను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.