ఏపీలో మద్య నిషేధం అన్నారు.. ఆదాయం మాత్రం 21 శాతం పెరిగింది.. ఏడాదిలో ఏం సాధించారు?

మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. అయితే ఏపీ అధికార పార్టీ మాత్రం తమ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి జరుగుతున్న దానికి పొంతన లేదు. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఇక, ప్రజలు ఆనారోగ్యం పాలు కావడం కాదు, ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు.

 

దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ 2019 అక్టోబర్ 1 న కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా 4,380  మద్యం షాపులలో 33 శాతం తగ్గించారు. ప్రస్తుతం ఏపీలో 2934 షాపులు మాత్రమే ఉన్నాయి. మద్యం అమ్మకాలకు అనుమతించే సమయం కూడా తగ్గించారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. కానీ, మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో మద్యం నియంత్రణ లక్ష్యం నీరుగారుతుందా అన్న సందేహం వస్తోంది.

 

2019 ఆగస్టులో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1747.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ఆదాయం రూ.1635.07 కోట్లుగా ఉంది. అంటే, 6.42 శాతమే తగ్గింది. ఇక గత ఏడాది సెప్టెంబర్ ‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ లో ఇప్పటికే 21.27 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. 2019 సెప్టెంబర్ కు గానూ రూ.1205.39 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో మొదటి 24 రోజుల్లోనే రూ.1461.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కలను గమనిస్తుంటే మద్యం దుకాణాలు తగ్గినా, మద్యం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో లోటు లేదని అర్థమవుతోంది. భారీగా పెంచిన ధరల కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి లోటు లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

 

ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కానీ, ఎందరో శానిటైజర్లు, నాటుసారా తాగి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇలాగే వింత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి.. కేవలం స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తే.. శానిటైజర్ మరణాలు, అక్రమ మద్య రవాణా, నాటుసారా తయారీ పెరిగే అవకాశముంది. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారన్న ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టి.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్య నిషేధం కోసం వేరే మార్గాలను అన్వేషించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.