ప్రత్యేక హోదా పై ఆ ముగ్గురు నోరెత్తట్లేదుగా? మళ్లీ అదే డ్రామానా!

2014, 2019 ఏపీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ప్రముఖ అంశం అయింది కానీ, 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆ అంశాన్నే ప‌క్క‌న పెట్టేశాయి.  ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు.  25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి.  గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.  

అయితే అంతగా ప్రాధాన్యం లేని కాంగ్రెస్ పార్టీ, అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ ప్ర‌త్యేక హోదా అంటూ జ‌పం చేస్తున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.  అయినా కాంగ్రెస్ పుంజుకునే సూచనలు కనిపించడం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా, రావా, అనే విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోదా విషయంలో హామీ ఇవ్వడం మాత్రం విశేషమే. 

ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు, ఆ తర్వాత మూతబడ్డాయి.  ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టింది.  ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తేలిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు. కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది.  అందుకే  నేతలంతా హోదాపై రాజీ పడటంతో ప్రజలు కూడా హోదాపై ఆశలు వదులుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు.

ప్రత్యేక హోదా  గురించి మాట్లాడుతుంటే జ‌నం వింతగా చూస్తున్నారని  వైఎస్ షర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ప్ర‌ధాన పార్టీలు పోరాటాలు చేయ‌లేద‌ని ఆమె ఆరోపించారు.   ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని.. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ష‌ర్మిల చెబుతున్నారు. 10 ఏళ్లు దాటిన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలు అభివృద్ది దూసుకెళుతుంటే.. ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. అయితే ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని ష‌ర్మిల చెబుతున్నారు.

ఏపీ ప్రత్యేక హోదా, రాజకీయ వివాదంగా మారి ప‌దేళ్ళైంది. అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనిపించారు. ఆ తరువాత వచ్చిన బీజేపీకి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసింది. రాజకీయ సుడిగుండంలో త‌మ అవసరాల మేరకు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌