ఇలా చేస్తే ఆర్థికంగా ఎదగకుండా ఎవ్వరూ ఆపలేరు..!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటాడు.  ముఖ్యంగా డబ్బు కారణంగా ఎలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటాడు.  అయితే.. చాలా మంది నేటి కాలంలో ఎదుర్కొనేది డబ్బు పరమైన సమస్యలే ఎక్కువ.  ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న వేసుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి. డబ్బు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే విషయాలు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు.  కొందరైతే డబ్బు లెక్కల గురించి ఇంట్లో వాళ్లు అడిగితే నేనేమైనా తిన్నానా అందరి కోసం ఖర్చు పెడుతున్నాగా అని అంటుంటారు. అయితే ఆర్థిక సమస్యలు రాకూడదన్నా,  ఆర్థికంగా బలంగా ఎదగాలన్నా కొన్ని మార్గాలు చాలా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

బలహీనతలు బయట పెట్టకూడదు..

ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే ఇలా బలహీనత ఉన్నట్టు బయట ఎవరికీ చెప్పకపోవడం మంచిది.  ఎందుకంటే బలహీనతను క్యాష్ చేసుకునేవారు ఉంటారు.  ఆ బలహీనతల మీద తాము ప్రయోజనం పొందాలని అనుకునేవారు ఉంటారు. అందుకే ఆర్థికంగా ఎదగాలంటే బలహీనతలను బయటపెట్టకూడదు.

తెలివిగా ఖర్చు చేయాలి..

డబ్బు సంపాదించడం కాదు.. ఖర్చు పెట్టడంలోనే అసలైన స్కిల్ దాగుంటుంది.  తక్కువ ఖర్చులు చేస్తూ ఎక్కువ పొదుపు చేస్తుంటే ఆర్థికంగా మెరుగవుతూ ఉంటారు.  తక్కువ ఖర్చు చేసినప్పుడు ఎవరైనా పిసినారి లాంటి పదాలు వాడినా పట్టించుకోకూడదు.  ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వరు.  ఒకవేళ ఎవరైనా అలా ఇచ్చినా వంద రూపాయలు చేతిలో పెట్టి వేలాది రూపాయలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటారు. కాబట్టి ఖర్చు పెట్టడమే తెలివిగా చేయాలి. దీనివల్ల పొదుపు సాద్యమవుతుంది.

వాదన..

మూర్ఖులు చాలామంది ఉంటారు.  తాము చెప్పిందే కరెక్ట్ అనుకేవారు ఎక్కువ.  అంతేకాదు.. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం కూడా మూర్ఖత్వమే..  ఇలాంటి మూర్ఖులతో వాదన చేయడం వల్ల సమయం వృధా.. మనిషి ఆర్థికంగా ఎదగాలని ఎప్పుడైతే అనుకుంటాడో.. అప్పుడు సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.

లక్ష్యాలు..

నేను ఇది చేయాలని అనుకుంటున్నాను,  ఇది సాధించాలని అనుకుంటున్నాను.  ఇంత పెట్టుబడి పెడతాను.. ఇలాంటివి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. లక్ష్యం ఏదైనా సరే.. సాధించేవరకు ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది.

స్వ కష్టం..

తన కష్టాన్ని తాను నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. తన పని కోసం  మరెవరిపైనా ఆధారపడకూడదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించలేనిది ఏదీ లేదు. కావలసిందల్లా తన పట్ల దృఢ సంకల్పం,  నిజాయితీ.

విద్యపై దృష్టి..

విద్య అనేది ఒక వ్యక్తి జీవితానికి కీలకం. జీవితంలో పురోగతికి ఇది చాలా అవసరం.  గురువు ప్రతిచోటా గౌరవించబడతాడు. పుస్తకాలు కూడా ఒక వ్యక్తికి మంచి స్నేహితుడు.

అవకాశాలు..

 ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయి. కానీ తెలివైన వారు  వాటిని గుర్తించి సరైన సమయంలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాంటి వారు  అవకాశాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. అవి వాటంతట అవే తమ వద్దకు వస్తాయి.

                          *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu